Chennai Air Show: చెన్నై ఎయిర్ షోలో తొక్కిసలాట.. ముగ్గురి మృతి, వందమందికిపైగా గాయాలు

| Edited By: Ram Naramaneni

Oct 06, 2024 | 10:08 PM

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ఆదివారం నిర్వహించిన ఎయిర్ షోలో అపశృతి చోటు చేసుకుంది. మెరీనా బీచ్ దగ్గర ఎయిర్‌షోకి జనం పోటెత్తారు. ఎయిర్‌షో చూసేందుకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. అయితే ఎయిర్‌షో ముగిశాక రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది..

Chennai Air Show: చెన్నై ఎయిర్ షోలో తొక్కిసలాట.. ముగ్గురి మృతి, వందమందికిపైగా గాయాలు
Chennai Air Show
Follow us on

చెన్నై, అక్టోబర్‌ 6: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ఆదివారం నిర్వహించిన ఎయిర్ షోలో అపశృతి చోటు చేసుకుంది. మెరీనా బీచ్ దగ్గర ఎయిర్‌షోకి జనం పోటెత్తారు. ఎయిర్‌షో చూసేందుకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. అయితే ఎయిర్‌షో ముగిశాక రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎయిర్ షోకు వచ్చిన సందర్శకులు, వీక్షకుల్లో ముగ్గురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఎయిర్ షో చూడటానికి మెరీనా బీచ్‌కు లక్షల మంది తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఎయిర్ షో ముగిసిన తర్వాత వారంతా తిరిగి వెళ్లడానికి మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో జనాలు స్టేషన్‌కు పోటెత్తడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 100 మందికిపైగా తీవ్రగాయాల పాలైనట్లు సమాచారం. క్షతగాత్రులు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, పౌర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు రోడ్డు మార్గం కూడా జనాలతో నిండిపోయింది. క్షతగాత్రులను తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ కోసం ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మెరీనా నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలను కలిపే ఆర్టీరియల్ రోడ్లు కూడా ట్రాఫిక్ జామ్‌ వల్ల తీవ్రంగా ఆటంకం కలిగింది. వాహనాలు కొన్ని నిమిషాల పాటు ఒకే స్థలంలో భారీగా నిలిచిపోయాయి. IAF ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా వైమానిక ప్రదర్శన మధ్యాహ్నం 1 గంటలకు ముగిసింది. అయితే మెరీనా బీచ్ దగ్గర దాదాపు మూడు గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్‌ అయ్యిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

చెన్నై ఎయిర్‌ షో ప్రత్యేకత..

ఇక ఆదివారం జరిగిన చెన్నై ఎయిర్‌షో అదిరిపోయింది. ఒక్క రోజే 15 లక్షల మంది ఎయిర్‌షోను వీక్షించడంతో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. యుద్ద విమానాలు విన్యాసాలు , హెలికాప్టర్ల చక్కర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. తమిళనాడు సీఎం స్టాలిన్‌ , డిప్యూటీ సీఎం ఉదయనిధి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎయిర్‌ఫోర్స్‌ డే వేడుకలు చెన్నై మెరినా బీచ్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 8వ తేదీన భారత వైమానిక దళం 92వ దినోత్సవం పుష్కరించుకొని ఐకానిక్ మెరీనా బీచ్‌లో ఐఏఎఫ్‌ ఎయిర్ షో నిర్వహిస్తోంది. భారత వైమానిక దళం పూర్తి వైమానిక రక్షణ సామర్థ్యాలను ఎయిర్‌ షోలో ప్రదర్శిస్తోంది. భారతదేశం నైపుణ్యాన్ని ఈ ఎయిర్‌ షో ద్వారా హైలైట్ చేస్తోంది. మొత్తం 72 IAF విమానాలు ఈప్రదర్శనలో పాల్గొన్నాయి.

రఫేల్‌ , తేజస్, సుఖోయ్ Su-30MKI, సూర్య కిరణ్ బృందం కీలకమైన ఏరోబాటిక్ ప్రదర్శనలు మెరీనా బీచ్‌లో ఆకట్టుకుంటున్నాయి. మెరినా బీచ్‌లో జరుగుతున్న ఎయిర్ షోకి ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ అమర్‌ప్రీత్‌సింగ్‌ , తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. భారత వైమానిక దళం ఎయిర్ షోను చూసి ఆనందించారు. మరోవైపు భారత వైమానిక దళం ఎయిర్‌ షో చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు వచ్చారు. దీంతో మెరినా బీచ్ సందడిగా మారింది. 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. సూపర్‌ సోనిక్‌ జెట్స్‌ విన్యాసాలు కూడా అదరగొట్టాయి. ఇక ఎయిర్‌ఫోర్స్‌ గరుడ కమెండోల విన్యాసాలు చెన్నై ఎయిర్‌షోలో హైలైట్‌గా నిలిచాయి. ఉగ్రవాదుల దాడి జరిగితే బందీలను ఎలా విడిపించాలన్న విషయంపై కమెండో డ్రిల్‌ ఆకట్టుకుంది. మెరుపుదాడి చేసి బందీలను విడిపిస్తారు ఎయిర్‌ఫోర్స్‌ కమెండోలు.. పారాచూట్‌ విన్యానాలు కూడా ప్రేక్షకుల మదిని దోచుకున్నాయి.

సారంగ్‌ హెలికాప్టర్‌ విన్యాసాలు ఈ షోకు హైలైట్‌గా నిలిచాయి. ఆరు హెలికాప్టర్లు గాలిలో రకరకాల విన్యాసాలు చేశాయి. చెన్నైలో రెండు దశాబ్దాల తరువాత ఇలాంటి ఎయిర్‌షోను నిర్వహించడంతో వేలాదిమంది పోటెత్తారు. భారత వైమానిక దళ సత్తాను ప్రపంచానికి మరో సారి చాటారు.. రికార్డు స్థాయిలో జనం చెన్నై ఎయిర్‌షోను వీక్షించారు. తొలిరోజే 15 లక్షల మంది విచ్చేశారని నిర్వాహకులు వెల్లడించారు. మెట్రో , బస్సులు , కార్లలో జనం మెరీనా బీచ్‌కు చేరుకున్నారు. ఎయిర్‌షో సందర్భంగా చెన్నైలో పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. చెన్నై ఎయిర్‌షో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను నమోదు చేసుకుంది. ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికి లక్షలాదిమంది ఎయిర్‌షోను చూడడానికి ఎగబడ్డారు. 230 మంది సొమ్మసిల్లిపడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. సెప్టెంబర్‌ 2003లో కూడా చెన్నైలో ఎయిర్‌షో జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.