IAS అధికారి కుక్కకోసం అథ్లెట్లను గెంటేసిన సిబ్బంది..ఖాళీ స్టేడియంలో వాకింగ్‌..! ఎక్కడంటే..

|

May 26, 2022 | 6:00 PM

2010 కామన్వెల్త్ గేమ్స్ కోసం నిర్మించబడిన ఓ అతిపెద్ద స్టేడియం ఓ ఐఏఎస్‌ అధికారి కుక్కకు వాకింగ్‌ సెంటర్‌గా మారింది. జాతీయ, రాష్ట్ర అథ్లెట్లు, ఫుట్‌బాల్‌ క్రీడాకారులు శిక్షణ పొందేందుకు నిర్మించిన బహుళ శిక్షణ కేంద్రంలోకి

IAS అధికారి కుక్కకోసం అథ్లెట్లను గెంటేసిన సిబ్బంది..ఖాళీ స్టేడియంలో వాకింగ్‌..! ఎక్కడంటే..
Stadium
Follow us on

2010 కామన్వెల్త్ గేమ్స్ కోసం నిర్మించబడిన ఓ అతిపెద్ద స్టేడియం ఓ ఐఏఎస్‌ అధికారి కుక్కకు వాకింగ్‌ సెంటర్‌గా మారింది. జాతీయ, రాష్ట్ర అథ్లెట్లు, ఫుట్‌బాల్‌ క్రీడాకారులు శిక్షణ పొందేందుకు నిర్మించిన బహుళ శిక్షణ కేంద్రంలోకి ఇప్పుడు ఒక ఐఏఎస్‌ అధికారి తన కుక్కతో ఈవినింగ్‌ వాక్‌ చేసేందుకు వాడుకుంటున్నారు. దీంతో ఆ స‌మ‌యంలో స్టేడియంలోకి క్రీడాకారుల‌ను రానివ్వ‌కుండా అక్కడి సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో క్రీడాకారుల కోసం స్టేడియం వేళలను పొడిగించింది సర్కార్‌. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో సంచలనంగా మారింది.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం స్టేడియంలలో అథ్లెట్లకు శిక్షణా సమయాన్ని పొడిగించింది. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో ఒక ఐఏఎస్ అధికారి తన కుక్కను వాకింగ్‌ కోసం తీసుకువస్తున్నట్టుగా ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. సదరు అధికారి కుక్కగారి కోసం అథ్లెట్లను త్వరగా ప్రాక్టీస్‌ ముగించుకోవాల్సిందిగా స్టేడియం సిబ్బంది ఆదేశించారు. దాంతో గత మూడు నెలలుగా అథ్లెట్లు తమ ప్రాక్టీస్‌ను తగ్గించుకోవలసి వచ్చిందని క్రీడాకారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని స్టేడియాలను రాత్రి 10 గంటల వరకు ఆటగాళ్ల కోసం తెరిచి ఉంచాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) సంజీవ్ ఖిర్వార్ సాయంత్రం వేళ త్యాగరాజ్ స్టేడియానికి వచ్చి, తన కుక్కతో కాసేపు కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం సిబ్బంది క్రీడాకారులను ముందుగానే అక్కడి నుంచి పంపివేస్తున్నారు. దీంతో క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై మీడియాలో వార్తలు రావడంతో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. క్రీడాకారులకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టేడియం వేళలను రాత్రి పది గంటల వరకు పొడిగించారు. ఢిల్లీ ఉప ముఖ్యమత్రి మనీష్ సిసోడియా ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదిలా ఉంటే, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ అనిల్ చౌదరి ఆరోపణలను ఖండించారు. ప్రభుత్వ ఆదేశాలు, స్టేడియం పనివేళలకు అనుగుణంగానే క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేస్తున్నారని చెప్పారు. ఎవరీని త్వరగా ఖాలీ చేయాలని చెప్పలేదని అన్నారు. “అథ్లెట్లకు శిక్షణ ఇవ్వడానికి అధికారిక సమయం రాత్రి 7 గంటల వరకు మాత్రమేనన్నారు. ఆ తర్వాత, కోచ్‌లు, అథ్లెట్లు వెళ్లిపోతారు. ఎవరినీ త్వరగా బయలుదేరమని చెప్పలేదన్నారు. కానీ, ఐఏఎస్‌ అధికారి ఖిర్వార్‌ తన కుక్కతో కలిసి వాకింగ్‌ వస్తున్నారా…? అన్న ప్రశ్నలకు మాత్రం అతడు సమాధానం చెప్పడానికి నిరాకరించాడు.