182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 ఏళ్ల వేడుకలు.. ప్రధాని మోదీ, ఫడ్నవీస్ హాజరు

ఒత్తిడి, హింస లేని సమాజాన్ని సృష్టించడమే ధ్యేయంగా 1981లో ప్రారంభమైన ఒక చిన్న ఆధ్యాత్మిక సంకల్పం.. నేడు ప్రపంచవ్యాప్తంగా అల్లుకుని మహా వృక్షమైంది. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో.. వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ తన 70వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని నెల రోజుల పాటు జరిగిన అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు.

182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 ఏళ్ల వేడుకలు.. ప్రధాని మోదీ, ఫడ్నవీస్ హాజరు
Art Of Living 45 Years Celebrations

Updated on: May 16, 2026 | 9:57 AM

ఆధ్యాత్మిక చైతన్యం, కరుణ, మానవతా సేవలలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ రెండు విశేష సందర్భాలను పురస్కరించుకుని బెంగళూరులోని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నెల రోజుల పాటు కన్నులపండువగా వేడుకలు నిర్వహించారు. ఈ అరుదైన మహాసభకు ఆధ్యాత్మిక నాయకులు, విధాన రూపకర్తలు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ప్రధాని మోదీ చేతుల మీదుగా నూతన ధ్యాన మందిరం ప్రారంభం

ఈ వేడుకల్లో అత్యంత కీలక ఘట్టంగా.. బెంగళూరు ఆశ్రమంలో నిర్మించిన ప్రతిష్ఠాత్మకమైన నూతన ధ్యాన మందిరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ.. “నేడు ఈ సంస్థ మన ముందు ఒక విశాలమైన మర్రిచెట్టులా నిలబడి ఉంది, దీని వేలాది కొమ్మలు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని జీవితాలను స్పృశిస్తున్నాయి” అని మోదీ కొనియాడారు. దీనితో పాటు విద్య, మహిళా, యువత సాధికారత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిపై దృష్టి సారించిన 9 దేశవ్యాప్త సేవా కార్యక్రమాలను కూడా మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఈ మందిరంలో దేశ విదేశాల ప్రముఖులు గురుదేవునితో కలిసి ప్రత్యేక ధ్యానంలో పాల్గొన్నారు.

ప్రపంచ దేశాలకు భారతదేశ ఆధ్యాత్మిక రాయబారి: దేవేంద్ర ఫడ్నవిస్

ఈ మహాసభలో పాల్గొన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. గురుదేవ్‌ను ప్రపంచం మొత్తానికి భారతదేశపు ఆధ్యాత్మిక రాయబారిగా అభివర్ణించారు. భారతదేశం కేవలం ఆర్థికంగా, సైనికంగానే కాకుండా ఆధ్యాత్మిక అగ్రరాజ్యంగా ఎదగడానికి గురుదేవ్ మార్గదర్శనం చేస్తున్నారని ప్రశంసించారు. మహారాష్ట్రలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపట్టిన జల సంరక్షణ పనులు, సహజ వ్యవసాయం ద్వారా రైతుల జీవితాల్లో వచ్చిన మార్పులను ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశారు.

అలాగే హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ మాట్లాడుతూ.. 45 ఏళ్ల క్రితం కర్ణాటక గడ్డపై వెలిగిన ఈ కరుణా దీపం, నేడు 182 కంటే ఎక్కువ దేశాల్లోని 100 కోట్లకు పైగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడారు. ఇటీవల జరిగిన “ప్రపంచ శాంతి కోసం గురుదేవునితో ప్రపంచ ధ్యానం” అనే ఆన్‌లైన్ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఒకేసారి పాల్గొనడం విశేషం.

సుదర్శన క్రియతో వరల్డ్ కప్ ఛాంపియన్‌గా: నూపుర్ షియోరాన్

ఈ వేడుకలకు హాజరైన భారత హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ నూపుర్ షియోరాన్ తన అద్భుత అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నేను 2024లో సుదర్శన క్రియ చేయడం ప్రారంభించాను. ఆ తర్వాత నా ఏకాగ్రత పెరిగి, 2025లో నేను ప్రపంచ కప్ ఛాంపియన్‌గా, వరల్డ్ నెం.2గా నిలిచాను’’ అంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్వాస ప్రక్రియల గొప్పతనాన్ని వివరించారు. ఆశ్రమంలోని పిల్లలు తమ సిక్స్త్ సెన్స్ ద్వారా కళ్లకు గంతలు కట్టుకుని చేసిన అద్భుత ప్రదర్శనలు అతిథులను మంత్రముగ్ధులను చేశాయి.

జీవితమే ఒక వేడుక: గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

గురుదేవులు ధ్యానం, అంతర్గత శాంతి గురించి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ‘‘మనస్సు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, ఆనందంగా ఉన్నప్పుడు బుద్ధి పదునుదేరుతుంది, శరీరం బలాన్ని పొందుతుంది. మీ ద్వారా లోకానికి మంచి పనులు జరుగుతాయి. జీవితంలో మనం పొందినదంతా దైవ కృపే.. జీవితమే ఒక వేడుక’’ అని గురుదేవ్ చాటిచెప్పారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులు అక్కడి 1,600 దేశీయ ఆవులున్న శ్రీ శ్రీ గోశాల, వేద విద్యలను అందించే వేద ఆగమ పాఠశాల, ప్రతిరోజూ 20,000 మందికి ఉచితంగా అన్నదానం చేసే భారీ వంటశాలను సందర్శించి అభినందించారు. గత 45 ఏళ్లుగా 182 దేశాల్లో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసిన ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, రాబోయే రోజుల్లో మానవాళికి మరిన్ని సేవలు అందించేలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

Follow Us