సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఊరట లభించింది. ఆయనపై పేర్కొన్న అభియోగాలన్నింటిని ఢిల్లీ ప్రత్యేక కోర్టు కొట్టిపారేసింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి గీతాంజలి గోయెల్ తీర్పును వెలువరించారు. ”వర్చువల్ పద్దతిలో కోర్టుకు హాజరైన శశి థరూర్.. తీర్పుపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాదాపు ఏడున్నర సంవత్సరాలు పడుతోన్న ఈ బాధకు విముక్తి లభించందని అన్నారు”.
కాగా, 2014వ సంవత్సరం జనవరి 17న శశి థరూర్ భార్య సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనితో శశి థరూర్‌పై 498-A, 306, IPC 302 సెక్షన్ల ప్రకారం నేరారోపణలు మోపారు. సునంద తన వైవాహిక జీవితంలో భర్త నుంచి ఎంతో టార్చర్‌ను ఎదుర్కొందని.. ఆయన ద్రోహచర్యల వల్ల మానసిక క్షోభను అనుభవిస్తూ వచ్చిందని అప్పట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ్ పేర్కొన్నారు.
డిప్రెషన్‌కు లోనయ్యి.. చాలారోజులు పస్తులు ఉంది.. శారీరికంగా గాయపరుచుకుందని.. ఇవే ఆమె చావుకి కారణాలని అతుల్ తెలిపారు. మూడో పెళ్లి కావడంతో మెంటల్ టార్చర్ అనుభవించి.. సునంద ఆత్మహత్యకు పాల్పడిందని అప్పట్లో అతుల్ శ్రీవాత్సవ్ అన్నారు. కాగా, ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి గీతాంజలి గోయెల్ తాజాగా ఈ అభియోగాలను కొట్టిపారేస్తూ శశి థరూర్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు.