SOnali Phogat: సోనాలి ఫోగట్ మృతిపై ఆమె సోదరుడు సంచలన వ్యాఖ్యలు.. ఆమెను హత్య చేసింది వీరేనంటూ పోలీసులకు ఫిర్యాదు..?
బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ మృతిపై ఆమె సోదరుడు రింకూ ధాకా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె గుండెపోటుతో చనిపోలేదని.. ఆమెను ఇద్దరు వ్యక్తులు హత్య చేశారని ఆరోపిస్తూ..
Sonali Phogat: బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ మృతిపై ఆమె సోదరుడు రింకూ ధాకా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె గుండెపోటుతో చనిపోలేదని.. ఆమెను ఇద్దరు వ్యక్తులు హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు గుండెపోటుతో ఆమె చనిపోయిందనుకుంటున్న సమయంలో సోనాలి ఫోగట్ సోదరుడి వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. సోనాలి ఫోగట్ గుండెపోటుతో మరణించడాన్ని తాను నమ్మ డం లేదన్నారు. ఆమె హత్యకు గురైందని సంచలన ఆరోపణలు చేశారు. సోనాలి ఫోగట్ చనిపోవడానికి ముందు ఆమె తన తల్లి, సోదరి, బావలతో మాట్లాడిందన్నారు. ఈసందర్భంగా తనతో సన్నిహితంగా ఉండే ఇద్దరు వ్యక్తులపై అనేక అనుమానాలు వ్యక్తం చేసిందని తెలిపారు. వారిద్దరే సోదరి సోనాలి ఫోగట్‌ను చంపేసి ఉండొచ్చని ఆరోపించాడు. సోనాలి ఫోగట్ ను తన పీఏ సుధీర్ సంగ్వాన్, మరో వ్యక్తి సుఖ్వింధర్ హత్యచేసి ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు.
హర్యానాలోని సోనాలి ఫోగట్ ఫామ్ హౌజ్ నుంచి ఉన్నట్టుండి సీసీటీవీ కెమెరాలు, ల్యాప్‌టాప్, ఇతర కీకలమైన సాక్ష్యాధారాలు కనిపించకుండా పోయాని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోనాలి పోగట్ గోవా వచ్చి ఓ హోటల్ లో ఉండగా.. గుండెపోటుకు గురైందని భావించి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సోనాలి ఫోగట్ సోదరుడు పోలీసులకు తాజాగా చేసిన ఫిర్యాదులో ఆమె మృతిపై అనేక అనుమానాలను లెవనెత్తుతూ.. హత్య అయి ఉంటుందని తెలిపాడు. ఎవరి నుంచి ప్రమాదం పొంచి ఉందో వారి నుంచి దూరంగా ఉండాలని సోనాలి ఫోగట్ కు సూచించామని.. తర్వాతి రోజు హిసార్ తిరిగిరావాలని చెప్పామని అంజునా పోలీస్ స్టేషన్ వద్ద రింకూ ధాకా మీడియాకు తెలిపాడు.
ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తే ఎఫ్ ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారని వివరించాడు. తాము చెప్తున్న ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ ఐఆర్ నమోదు కాకుంటే తమ సోదరి సోనాలి ఫోగట్ మృతదేహనికి పోస్టు మార్టం నిర్వహించడాదనికి అనుమతించబోమని.. ఢిల్లీ లేదా జైపూర్ ఎయిమ్స్ లో పోస్టు మార్టం చేయాలని తాము కోరుతున్నామన్నారు. తమ సోదరి 15 సంవత్సరాల పాటు బీజేపీ నాయకురాలిగా కొనసాగారని.. తమకు న్యాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరతామన్నారు. ఇప్పటికే దీనిని వైద్యులు గుండెపోటుగా భావిస్తున్నారని గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పగా.. సోనాలి ఫోగట్ సోదరుడి వ్యాఖ్యల నేపథ్యంలో గోవా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..