హిమాచల్ ప్రదేశ్‌లో చలి విపరీతంగా ఉంది. మనాలిలో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రత మైనస్‌లో ఉంది. హిమపాతాన్ని ఆస్వాదించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. మంచు కారణంగా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సొలంగనాలలో వెయ్యికి పైగా వాహనాలు జామ్‌లో చిక్కుకున్నాయి. మనాలి-సోలంగ్నాల రహదారిపై 6 కిలోమీటర్ల పొడవైన మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్న పోలీసులు మైనస్ ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్యాటక నగరం మనాలికి ఆనుకుని ఉన్న పల్చన్, సొలంగనాల, అటల్ టన్నెల్‌లో సాయంత్రం నుంచి భారీగా మంచు కురుస్తోంది. దీంతో సొలంగనాల వైపు వెళ్లిన పర్యాటకుల వాహనాలు నిలిచిపోయాయి. మంచు కురుస్తున్న తీవ్రతను చూసిన పోలీసు బృందం సొలంగానాలకు చేరుకుని ఇక్కడ నిలిచిపోయిన వాహనాలను తొలగించే పనిని ప్రారంభించారు.
పర్యాటకులను పోలీసులు సురక్షితంగా తరలిస్తున్నారు. సమాచారం ప్రకారం భారీ మంచు కారణంగా 1000 కంటే ఎక్కువ పర్యాటక వాహనాలు సొలంగనాల నుంచి మనాలి మధ్య నిలిచిపోయాయి. రోడ్డుపై దాదాపు 6 కిలోమీటర్ల మేర జామ్ ఏర్పడింది. వాహనాలు నిలిచిపోవడం, రోడ్డు దిగ్బంధం కావడంతో వాహనాలను విడిపించేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వస్తోంది.
మైనస్ టెంపరేచర్‌తో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమపాతం కారణంగా పర్యాటకులు సంతోషంగా ఉన్నారు. అయితే ప్రస్తుత వాతావరణం పోలీసులకు సవాలుగా మారింది. ఈరోజు పర్యాటకులను జిల్లా యంత్రాంగం సోలంగ్నాల వరకు మాత్రమే పంపింది. సాయంత్రం నుంచి మంచు కురుస్తుండటంతో పర్యాటకులు సకాలంలో అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అయితే వేల సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలన్నింటినీ మనాలికి సురక్షితంగా తరలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పర్యాటకులు రోహ్‌తంగ్ టన్నెల్, జలోడి పాస్ వైపు వెళ్లవద్దని పరిపాలన ఆదేశాలు జారీ చేసింది. హిమపాతం కారణంగా కులు, లాహౌల్‌లోని దాదాపు 15 బస్సు మార్గాలు ప్రభావితమయ్యాయి. సిమ్లాలోని నరకందలో కూడా మంచు కురుస్తోంది. ట్రాఫిక్ సైంజ్ నుంచి లుహ్రి.. సున్నీ మీదుగా సిమ్లా వైపు మళ్లించబడింది.