Amit Shah: ఉగ్రవాదులనే అనుమానంతో సైనికుల కాల్పులు.. నాగాలాండ్‌ ఘటనపై కేంద్రమంత్రి అమిత్‌ షా స్టేట్‌మెంట్‌..

|

Dec 06, 2021 | 4:51 PM

Amit Shah on Nagaland shooting probe: నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలో దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

Amit Shah: ఉగ్రవాదులనే అనుమానంతో సైనికుల కాల్పులు.. నాగాలాండ్‌ ఘటనపై కేంద్రమంత్రి అమిత్‌ షా స్టేట్‌మెంట్‌..
Amit Shah
Follow us on

Amit Shah on Nagaland shooting probe: నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలో దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌స‌భ‌లో ప్రకటన చేశారు. నాగాలాండ్‌లో పౌరులపై కాల్పులు జరపడం దురదృష్టకరమని షా ఆవేదన వ్యక్తంచేశారు. ఉగ్రవాదులనే అనుమానంతోనే సైనికులు కాల్పులు జరిపారని తెలిపారు. పొరపాటున కాల్పులు జరిగాయని.. దీనిపై నెలరోజుల్లో విచారణ జరుపుతామని అమిత్‌ షా పేర్కొన్నారు. మాన్‌లోని ఓటింగ్‌లో తీవ్రవాదుల క‌ద‌లిక‌లు ఉన్నట్లు ఆర్మీకి స‌మాచారం వ‌చ్చింద‌ని.. ఆ స‌మ‌యంలో అనుమానిత ప్రాంతంలో సుమారు 21 మంది క‌మాండోలు ఆప‌రేష‌న్‌కు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. అయితే అక్కడకు వ‌చ్చిన వాహ‌నాన్ని ఆపేందుకు ప్రయత్నించగా.. ఆ వాహ‌నం ఆగ‌కుండా వెళ్లింద‌ని.. దీంతో ఆ వాహ‌నంలో తీవ్రవాదులను త‌ర‌లిస్తున్నట్లు అనుమానించి ఆర్మీ కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింద‌ని షా పేర్కొన్నారు.

వాహ‌నంలో ఉన్న 8 మందిలో ఆరుగురు చనిపోయారని.. గాయ‌ప‌డ్డ మరో ఇద్దరినీ స‌మీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి ఆర్మీ త‌ర‌లించి చికిత్స అందిస్తున్నట్లు అమిత్‌ షా తెలిపారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత గ్రామ‌స్తులు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి, రెండు వాహ‌నాలు ధ్వంసం చేశార‌ని, సైనికుల‌పై తిర‌గ‌బ‌డ్డార‌ని హోంమంత్రి వివరించారు. జవాన్లపై జరిపిన దాడిలో ఒక జవాను మరణించాడు, పలువురికి గాయాలు అయ్యాయని షా తెలిపారు. జవాన్లు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కాల్పుల వ‌ల్ల మ‌రో ఏడుగురు పౌరులు మృతి చెందారని షా వెల్లడించారు. స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారన్నారు.

ఈ ఘటనపై ఏర్పాటు చేసిన సిట్‌ నెలరోజుల్లో దర్యాప్తును పూర్తి చేసి సమగ్రమైన నివేదిక ఇస్తుందన్నారు. విచారణలో పొరపాటు జరిగినట్టు గుర్తించామన్నారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని తెలిపారు. నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు తీసుకుంటామని అమిత్‌ షా వెల్లడించారు. ప్రస్తుతం ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్నా.. అదుపులోనే ఉంద‌ంటూ షా తెలిపారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతాన్ని డిసెంబ‌ర్ 5వ తేదీన నాగాలాండ్ డీజీపీ, క‌మీష‌న‌ర్ విజిట్ చేశార‌ని వివరించారు. ఆర్మీ కాల్పుల ఘ‌ట‌న ప‌ట్ల ఎఫ్ఐఆర్ రిజస్టర్‌ చేశామ‌ని.. కేసు విచార‌ణ కోసం రాష్ట్ర పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.

Also Read:

Crime News: గన్నుతో పదో తరగతి విద్యార్థి హల్‌చల్‌.. ప్రిన్సిపాల్‌నే చంపబోయాడు.. ఎందుకంటే..?

Rajnath Singh: రష్యా మంత్రులతో సమావేశంలో చైనా చొరబాట్ల అంశం.. సరిహద్దుల్లో ఆక్రమణలపై కఠినంగా మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్