Crime: కెనడాలో సిక్కు నాయకుడు రిపుదమన్‌ సింగ్‌ మాలిక్‌ హత్య.. నాటి ఘటనకు ప్రతీకారమేనా?

|

Jul 16, 2022 | 9:44 AM

Crime: సిక్కు నేత, ఎయిరిండియా విమానం పేల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రిపుదమన్‌ సింగ్‌ మాలిక్‌ కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు.

Crime: కెనడాలో సిక్కు నాయకుడు రిపుదమన్‌ సింగ్‌ మాలిక్‌ హత్య.. నాటి ఘటనకు ప్రతీకారమేనా?
Ripudaman Singh Malik
Follow us on

Crime: సిక్కు నేత, ఎయిరిండియా విమానం పేల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రిపుదమన్‌ సింగ్‌ మాలిక్‌ కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. కారులో వెళుతున్న మాలిక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. 1985లో ఎయిరిండియా విమానాన్ని ఉగ్రవాదులు గాల్లో పేల్చేశారు. అతి భీకరమైన ఆ ఉగ్ర దాడిలో 329 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రిపుదమన్‌ సింగ్‌ మాలిక్‌ 2005లో నిర్దోషిగా బయటపడ్డారు. 1985 జూన్​ 23న టొరంటో నుంచి ముంబైకు బయలుదేరిన ఎయిరిండియా కనిష్క విమానం అట్లాంటిక్​సముద్రంపై ప్రయాణిస్తుండగా ఉగ్రవాదులు సూట్‌కేసు బాంబ్‌తో పేల్చేశారు. 24 మంది భారతీయులతో పాటు ప్రయాణికులు అందరూ మరణించారు. ఈ కుట్రలో ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొన్న మాలిక్‌ 17 ఏళ్ల క్రితమే నిర్దోషిగా బయటపడ్డారు.

1984 స్వర్ణ దేవాలయంలో భారత సైన్యం చేపట్టిన బ్లూ స్టార్‌ ఆపరేషన్‌కు ప్రతీకారంగానే విమానాన్ని పేల్చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మాలిక్‌ వయసు 75 ఏళ్లు. తన కారులో బయటకు వెళ్లినప్పుడు సర్రే ప్రాంతంలో దుండగులు అడ్డగించి కాల్పులు జరిపారు. మాలిక్​పై మూడు రౌండ్ల కాల్పులు జరిపి, తర్వాత ఆయనను కారులో నుంచి బయటకు లాగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం.

హత్య జరిగిన ప్రదేశానికి దగ్గర్లో ఓ కారు అనుమానాస్పద స్థితిలో తగులబడింది. మాలిక్​హత్య గురించి పోలీసులు ముందు ప్రకటించలేదు. మాలిక్‌ తనయుడు జస్ప్రీత్​మాలిక్ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టుతో చనిపోయింది మాలికే అని స్పష్టమైంది. తర్వాత కెనడా పోలీసులు కూడా ప్రకటన విడుదల చేశారు. కోర్టు తీర్పును పట్టించుకోకుండా తన తండ్రిని ఇంకా దోషిగానే చూస్తున్నారన్నారు జస్ప్రీత్‌. తన తండ్రి హత్యకు, ఆయన గతానికి సంబంధం ఉండకూడదని ప్రార్థిస్తున్నట్టు రాశారు. మాలిక్‌ది టార్గెటెడ్ కిల్లింగ్​లాగే ఉందని, హత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..