భారత్, చైనా సరిహద్దులో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మంచుకొండలు నివురుగప్పిన నిప్పులా మారాయి. డ్రాగన్ చొరబాటు కుట్రలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. ఇరు దేశాలు యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామగ్రి, భారీగా బలగాలను మోహరించాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.
ఎల్‌ఏసీ వెంబడి మూడ్రోజులుగా భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది జిత్తులమారి చైనా. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చుముర్ ప్రాంతంలోకి చొరబడేందుకు విఫలయత్నం చేసింది డ్రాగన్. కీలక ప్రాంతమైన బ్లాక్‌టాప్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఎత్తులు చేసింది. కాని చైనా డ్రామాలను పసిగట్టిన భారత్..సమర్థవంతంగా తిప్పికొట్టింది.
ఎల్‌ఏసీ వైపు చైనాకు చెందిన 8 భారీ వాహనాలు చొచ్చుకొచ్చాయి. చైనా సైన్యాన్ని గమనించిన భారత్ వెంటనే అప్రమత్తమైంది. డ్రాగన్ కంటే ముందే ఆ ప్రాంతంలో మోహరించింది. దీంతో భారత దళాలను చూసి తోకముడుచుకొని పారిపోయింది డ్రాగన్ సైన్యం.
కీలక పర్వత శిఖరాలను తన అధీనంలోకి తెచ్చుకొని ఆ ప్రాంతంపై పూర్తిగా పట్టుబిగించింది భారత్. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-ప్లా బ్లాక్‌టాప్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కెమెరాలను , నిఘా వ్యవస్థను తొలగించింది. చైనా చొరబాట్లను అడ్డుకునేందుకు తన నిఘా వ్యవస్థను బలోపేతం చేసింది. ఈ చర్యను చైనా జీర్ణించుకోలేకపోతోంది. కనీసం రెండు పర్వత శిఖరాల నుంచి భారత దళాలను ఖాళీ చేయించేందుకు పదేపదే విఫలయత్నం చేస్తోంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను అంతకంతకూ పెంచుతోంది. ఫలితంగా ఇరు దేశాల సైనిక మోహరింపులు ముమ్మరమయ్యాయి.
ఈ ఘటన తరువాత శ్రీనగర్ – లేహ్ హైవే చాలా హడావుడి కన్పిస్తోంది. లేహ్‌కు పెద్ద ఎత్తున సైనిక వాహనాలు తరలివెళ్తున్నాయి. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొవడానికైనా సిద్దంగా ఉన్నట్టు భారత సైన్యం ప్రకటించింది. గత నెల 29,30 తేదీల్లో కూడా భారత్‌లోకి చొరబడేందుకు చైనా విఫలయత్నం చేసిందని తెలిపాయి భారత దళాలు. డ్రాగన్ పదేపదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని వెల్లడించాయి. ఒకవైపు చర్చలు జరుగుతుండగానే..పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది భారత్. తమ సైన్యం సకాలంలో స్పందించి చైనా చర్యలకు అడ్డుకట్ట వేశామంటోంది.
ఐతే బ్లాక్‌టాప్ ప్రాంతం తమదేనని చైనా వాదిస్తోంది. భారత్ వెనక్కి పోవాలని ప్రకటనలు చేస్తోంది. తాము ఇతర దేశాల భూభాగాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని, కవ్వింపు చర్యలకు పాల్పడలేదని ప్రకటించింది. భారత్, చైనా మధ్య ఇంకా సరిహద్దులు ఖరారు కాలేదని, అందువల్లే తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ. విభేదాలు.. ఘర్షణలుగా మారకూడదని..ఇరు దేశాల అగ్రనాయకులు తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాల్సిన అవసరం ఉందన్నారు. చర్చల ద్వారా భారత్‌తో అన్ని సమస్యలనూ పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ఐతే ఒకవైపు చర్చల పేరుతో శాంతి మంత్రం జపిస్తూనే ..మరోవైపు తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో రెండు హెలిపోర్టులు నిర్మిస్తోంది చైనా. గాల్వన్ లోయ పక్కనున్న టిన్‌షున్, రుటోగ్ కౌంటీలో సైలెంట్‌గా నిర్మాణాలు చేపట్టింది. తన సైన్యాన్ని లద్దాఖ్ ప్రాంతానికి తరలించేందుకు వీలుగా ఈ హెలిపోర్టుల నిర్మాణం చేపట్టినట్లు చెబుతున్నారు రక్షణ శాఖ నిపుణులు.
ఇరు దేశాల మధ్య తాజా సరిహద్దు వివాదంపై ఇరు దేశాల బ్రిగేడియర్ స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై బ్రిగేడియర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడ్రోజుల పాటు చర్చించిన అధికారులు..ఇవాళ మరోసారి భేటీ అవుతున్నారు.