
దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. యూపీలో రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ తదుపరి ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఢిల్లీలో నాలుగు రోజుల పాటు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. వారం రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. పాకిస్తాన్-రాజస్థాన్ సరిహద్దు నుంచి వీస్తున్న వేడి గాలులు, స్పష్టమైన ఆకాశం, ఉత్తర-పశ్చిమ దిశ నుంచి వీచే పొడి గాలులు వేడిని మరింత పెంచుతున్నాయి. ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్‌లలో మధ్యాహ్నం సమయంలో వేడి తీవ్రత అత్యధికంగా ఉంది. వాతావరణ మార్పులు (క్లైమేట్ చేంజ్) మరియు ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు
-బాందా (తూర్పు ఉత్తరప్రదేశ్): 48.2 డిగ్రీలు (దేశంలోనే అత్యధికం)
-నౌగాంగ్ (తూర్పు మధ్యప్రదేశ్): 47 డిగ్రీలు
-రోహతక్ (హర్యానా): 46.9 డిగ్రీలు
-ఝాన్సీ (పశ్చిమ ఉత్తరప్రదేశ్): 46.5 డిగ్రీలు
-చితోర్ఘడ్ (తూర్పు రాజస్థాన్): 46.3 డిగ్రీలు
-శ్రీగంగానగర్ (పశ్చిమ రాజస్థాన్): 45.9 డిగ్రీలు
-పాటియాలా (పంజాబ్): 45.3 డిగ్రీలు
-అహ్మదాబాద్ (గుజరాత్): 43.7 డిగ్రీలు
-నిజామాబాద్ (తెలంగాణ): 44 డిగ్రీలు
తీవ్రమైన వేడిగాలులు ఎండల ప్రభావంతో ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్, తర్వాత ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో మరో రెండు రోజులు భయంకరమైన వడగాల్పులు కొనసాగనున్నాయి. డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఆదేశాల మేరకు అన్ని జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వడదెబ్బ బాధితులకు తక్షణ చికిత్స అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.
వేడి ఎండ తీవ్రత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..పిల్లలు, వృద్ధులు, బయట పని చేసే వ్యక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఎక్కువగా బయటకు రాకపోవడం మంచిది.తగినంత నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, తలకు కుడితో కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.రానున్న రోజుల్లో ఎండ వేడి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
మంగళవారం ప్రపంచంలోని అత్యంత వేడి నగరాలైన టాప్ 100 అన్నీ భారతదేశంలోనే ఉన్నాయి. ఇది దేశంలోని చాలా ప్రాంతాలను చుట్టుముట్టిన వడగాలుల తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఈ జాబితా కేవలం చిన్న పట్టణాలకే పరిమితం కాలేదు. న్యూఢిల్లీ, గుర్గావ్, ఫరీదాబాద్, చండీగఢ్, ఆగ్రా, వారణాసి, ప్రయాగ్రాజ్, నాగ్‌పూర్, లుధియానాతో సహా అనేక ప్రముఖ నగరాలు, ప్రధాన పట్టణ కేంద్రాలు కూడా ఈ ర్యాంకింగ్‌లలో చోటు దక్కించుకున్నాయి.