Heat Wave: దేశ రాజధాని ఢిల్లీలో నిప్పులు కక్కిన భానుడు.. 76 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు

|

Mar 29, 2021 | 11:55 PM

Heat Wave in Delhi: ఈ ఏడాది భానుడి ఉగ్రరూపం మొదలైంది. ఈ వేసవిలో ఎండల ప్రతాపం ఎక్కువగా ఉంటుందని ఇటీవలనే వాతావరణ శాఖ హెచ్చరించిన

Heat Wave: దేశ రాజధాని ఢిల్లీలో నిప్పులు కక్కిన భానుడు.. 76 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు
Heat Wave In Delhi
Follow us on

Heat Wave in Delhi: ఈ ఏడాది భానుడి ఉగ్రరూపం మొదలైంది. ఈ వేసవిలో ఎండల ప్రతాపం ఎక్కువగా ఉంటుందని ఇటీవలనే వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరిక చేసి కొన్ని రోజులే అవుతోంది. అప్పుడే భానుడి ప్రతాపం మొదలైంది. హోలీ పర్వదినాన మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో భానుడి నిప్పులు కురిపించాడు. ఈ వేసవి తొలి ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోయారు. బయటకు వచ్చేందుకే భయపడుతూ ఇళ్లకే పరిమితమయ్యారు. మంగళవారం ఢిల్లీలో ఏకంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 76 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. సాధారణం కంటే ఇది ఎనిమిది డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ ప్రాంతీయ కేంద్రం అధికారి కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో ఈ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.

31 మార్చి 1945లో ఇక్కడ రికార్డుస్థాయిలో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని, ఆ తర్వాత మళ్లీ ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని కుల్దీప్ తెలిపారు. అలాగే, నజఫ్‌గఢ్, నరేలా, పీతంపురా, పుసా ప్రాంతాల్లోని వాతావరణ కేంద్రాల్లో వరుసగా 41.8 డిగ్రీలు, 41.7 డిగ్రీలు, 41.6 డిగ్రీలు, 41.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ అధికారులు తెలిపారు. కాగా.. రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత కూడా 20.6 డిగ్రీలుగా నమోదైందని, ఇది సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువని పేర్కొన్నారు. అయితే.. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుందని శ్రీవాస్తవ తెలిపారు.

ఇదిలాఉంటే.. మే నెల రాకముందే.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతాల్లో సాధారణ ఎండలకే ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతుంటారు. అలాంటిది ఒకేసారి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో.. ఈ వేసవి కాలం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందేనని పేర్కొంటున్నారు.

Also Read:

శ్రీకాకుళం జిల్లాలో పండుగ పూట విషాదం.. హోలీ వేడుకల అనంతరం స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల గల్లంతు..