Second Dose Vaccine: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఏడాదిగా ఇబ్బందులకు గురి చేసిన కరోనాకు వ్యాక్సిన్ తయారీలో భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్రంగా శ్రమించాయి. ఎట్టకేలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే ఫిబ్రవరి 13 నుంచి ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ రెండో డోసును అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో గరువారం మధ్యాహ్నం వరకు 45,93,427 మందికి వ్యాక్సిన్ అందించామని అన్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1.60 లక్షలు ఉండగా, మొత్తంగా ఇప్పటి వరకు 19.9 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 1.07 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయని అన్నారు. అలాగే 1.54 లక్షల మంది కరోనాతో మృతి చెందినట్లు చెప్పారు.
దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో 70 శాతం కేరళ, మహారాష్ట్రల నుంచి నమోదవుతున్నాయని పేర్కొన్నారు. అత్యంత వేగంగా 4 మిలియన్ల వ్యాక్సినేషన్ మార్క్‌ను మనం చేసుకున్నాము అని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 97 శాతం మంది వ్యాక్సిన్ పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు.
ప్రస్తుతం దేశంలో 5,912 ప్రభుత్వ ఆస్పత్రులు, 1,239 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నామని అన్నారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 73.6శాతం ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ అందించినట్లు చెప్పారు. తర్వాత స్థానాల్లో రాజస్థాన్ 66.8 శతం, త్రిపుర 65.5శాతం ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో 30 శాతం కన్నా తక్కువ మందికి వ్యాక్సిన్‌ను అందించామన్నారు. మొత్తం దేశంలో 45 శాతం వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లను అందించినట్లు రాజేష్ భూషణ్ తెలిపారు.