Watch: గుంతలో పడ్డ కారు.. రాజకీయ కుట్ర అంటున్న బాధితురాలు .. వీడియో వైరల్..

వాహనం గుంతలో పడడానికి కారణం బీహార్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అని నీతు సింగ్ ఆరోపించారు. వానా కాలంలో గుంత పూడ్చకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Watch: గుంతలో పడ్డ కారు.. రాజకీయ కుట్ర అంటున్న బాధితురాలు .. వీడియో వైరల్..
Scorpio Falls Into Pothole In Patna

Updated on: Sep 22, 2025 | 5:53 PM

బీహార్‌లో జరిగిన ఓ ప్రమాదం రాజకీయంగా రంగు పులుముకుంది. ఓ గుంత రాజకీయ ఆరోపణలకు వేదిక అయ్యింది.  భారీ వర్షాలకు తడిసిముద్దైన పట్నాలో ఊహించని ఘటన జరిగింది. కొత్తగా కట్టిన మల్టీ-మోడల్ హబ్ దగ్గర రోడ్డుపై ఉన్న ఒక పెద్ద గుంతలో స్కార్పియో కారు పడిపోయింది. సగం కారు నీటిలో మునిగిపోయింది. అదృష్టవశాత్తూ స్థానికుల సహాయంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంపై కారు యజమాని నీతు సింగ్ చౌబే సంచలన ఆరోపణలు చేశారు. ఇది కేవలం ప్రమాదం కాదని, నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి జరిగిన కుట్ర అని ఆమె ఆరోపించారు.

ఇది కుట్ర.. కలెక్టర్‌తో మాట్లాడాను..

ఇదంతా బీహార్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వాళ్ళ తప్పిదమని నీతు సింగ్ ఆరోపించారు. ‘‘ 20 రోజులుగా రోడ్డుపై గుంతను అలాగే వదిలేశారు. వర్షాల సీజన్‌లో ఇంత నిర్లక్ష్యమా..? మా కారు పడ్డ తర్వాత మరో బైక్ కూడా పడింది. ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు?’’ అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా “గుంత చుట్టూ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు, బారికేడ్లు లేవు. ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే ఇలా చేశారని నాకు అనిపిస్తోంది. నేను నేరుగా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను” అని ఆమె అన్నారు.

కాగా ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ గుంతలో పడతారని.. అయినా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గుంత సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.