
నిజాయతీ ఇంకా బతికే ఉంది. ఆమెది పేద కుటుంబం కావొచ్చు కానీ మనసు మాత్రం పెద్దది. చెన్నైలోని టి నగర్ ప్రాంతంలోని ముపతమ్మన్ కోయిల్ వీధిలో పారిశుధ్య కార్మికులు డైలీ రొటీన్‌లో భాగంగా శుభ్రపరిచే పనిలో ఉన్నారు. ఆ సమయంలో రోడ్డు పక్కన ఒక బ్యాగ్ పడి ఉంది. పారిశుధ్య కార్మికురాలు పద్మ ఆ బ్యాగ్ తెరిచి చూడగా అందులో ఉన్న వస్తువులను చూసి ఆమె షాక్ అయ్యింది. అందులో రూ.50 లక్షల విలువైన దాదాపు 45 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే పద్మ ఆ నగలను కాజేయాలనుకోలేదు. వాటి యజమానికి అవి దక్కాలని భావించింది. అందుకే ఆ బ్యాగును తీసుకెళ్లి.. పాండీ బజార్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించింది. పోలీసులు ఆ నగలకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. ఎంక్వైరీలో.. ఆ నగలు నంగనల్లూరు నివాసి రమేష్‌కు చెందినవని తేలింది. అతను అప్పటికే నగలు పోయాయని స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రమేష్‌ను.. పాండీ బజార్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, సంబంధిత పత్రాలను పరిశీలించి, నగలను అప్పగించారు. ఇంత నిజాయతీగా నగలు అప్పగించిన పద్మను.. రమేష్‌తో పాటు పోలీసులు ప్రశంసించారు.
తాను సుమిత్ అనే కంపెనీలో శుభ్రపరిచే కార్మికురాలిగా పనిచేస్తున్నట్లు పద్మ తెలిపారు. ‘నేను ఈ రోజు ఉదయం శుభ్రం చేస్తున్నప్పుడు, రోడ్డుపై పడి ఉన్న ఒక బ్యాగ్ చెత్త అని భావించి తీసుకున్నాను. తెరిచి చూడగా.. అందులో నగలు కనిపించాయి. వెంటనే, నేను నా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి.. ఆ బ్యాగ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించాను. ఈ నగలు చూసినప్పుడు, వాటిని పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించాలని నాకు అనిపించింది’ అని పద్మ చెప్పడం ఆమె మంచి మనసును చాటి చెబుతుంది.
పద్మ మాత్రమే కాదు ఆమె భర్త కూడా గతంలో ఇలాంటి పనే చేశాడు. అతను ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆటో నడుపుతుండగా.. ఓ రోజు అతనికి రోడ్డు పక్కన నల్లటి బ్యాగ్ కనిపించింది. ఓపెన్ చేసి చూడగా.. అందులో నగదు కట్ట ఉంది. వెంటనే ఆ డబ్బును స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. వారు ఆ నగదు యజమానిని కనుగుని డబ్బు అందజేశారు. ఆ సమయంలో ఆ డబ్బు యజమాని ముఖంలో ఆనందం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని పద్మ భర్త తెలిపాడు. భర్త మార్గంలో పయనించి తానూ అలా చేసినట్లు పద్మ తెలిపారు. నిజంగా వీరు ఆదర్శ దంపుతులు కదూ..! మీరేమంటారు…!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.