Sambhal:హే శివ.. సంభల్‌లో బయటపడ్డ పురాతన శివాలయం.. పోటెత్తిన భక్తులు

యూపీ లోని సంభల్‌లో బయటపడ్డ పురాతన శివాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయంతో పాటు పురాతన బావిపై కార్బన్‌ డేటింగ్‌ నిర్వహించాలని పురావస్తు శాఖకు స్థానిక కలెక్టర్‌ లేఖ రాశారు.

Sambhal:హే శివ.. సంభల్‌లో బయటపడ్డ పురాతన శివాలయం.. పోటెత్తిన భక్తులు
Lord Shiva Hanuman Mandir

Updated on: Dec 15, 2024 | 8:52 PM

ఉత్తరప్రదేశ్‌‌లోని సంభల్‌లో 40 ఏళ్ల తరువాత వెలుగుచూసిన శివాలయానికి భక్తులు బారులు దీరారు. శివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. అక్రమ నిర్మాణాల మధ్య చిక్కుకుపోయిన ఈ ఆలయం శనివానం వెలుగుచూసింది. శివాలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో బయటపడ్డ పురాతన బావిపై కార్బన్‌ డేటింగ్‌ నిర్వహించాలని పురావస్తు శాఖకు జిల్లా కలెక్టర్‌ రాజేందర్‌ పన్సియా లేఖ రాశారు. పురాతన బావిని కొందరు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. ఆక్రమణల తొలగింపు కొనసాగుతోందని ప్రకటించారు. శివాలయంతో ఎస్పీతో కలిసి కలెక్టర్‌ పూజలు నిర్వహించారు. సంభల్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు.

శివాలయం 1978 నుంచి మూతపడిందని, సాంప్రదాయ రీతిలో తిరిగి ఆలయాన్ని తెరిచినట్టు నగర్ హిందూ సభ నేత విష్ణు శరణ్ రస్తోగి తెలిపారు. ఇక్కడ నివసించే కొన్ని కుటుంబాలు వేరేచోటికి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆలయాన్ని పట్టించుకునే వాళ్లే లేకపోయారని ఆలయ చరిత్రను వివరించారు. కొందరు వ్యక్తులు ఇళ్ల నిర్మాణం కోసం ఆలయాన్ని ఆక్రమించినట్టు తమ తనిఖీల్లో తేలిందని అదనపు ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు. ఆలయాన్ని శుభ్రం చేశామని, ఆలయ ప్రాంతాన్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయం ముందు ఒక పురాతన బావి ఉండేదనే సమాచారంతో అక్కడ తవ్విచూడగా బావి ఆనవాళ్లు కనిపించాయని చెప్పారు. సంభల్‌లో బయటపడ్డ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని స్థానిక కలెక్టర్‌ చెబుతున్నారు. ఆలయం లోపల, బయట అధికారులు సీసీటీవీలను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..