Russia – Ukraine Crisis: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో.. 35 నిమిషాల పాటు మాట్లాడిన ప్ర‌ధాని మోడీ..!

|

Mar 07, 2022 | 2:05 PM

Volodymyr Zelensky with Narendra Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోనులో మాట్లాడారు.

Russia - Ukraine Crisis: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో.. 35 నిమిషాల పాటు మాట్లాడిన ప్ర‌ధాని మోడీ..!
Zelensky With Modi
Follow us on

Ukraine Presiden Zelensky and PM Modi Talks: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ(Volodymyr Zelensky)తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) ఫోనులో మాట్లాడారు. వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాష‌ణ కొన‌సాగింది. ఉక్రెయిన్ నుంచి భార‌త పౌరుల త‌ర‌లింపులో సాయం ప‌ట్ల జెలెన్ స్కీకి మోడీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దాదాపు అరగంటపైగా సాగిన ఈ ఫోన్ కాల్ ద్వారా మోడీ జెలెన్‌స్కీ‌తో పలు విషయాలు చర్చించారు. రష్యా-ఉక్రేయిన్ల (Russia-Ukraine War)మధ్య శాంతి చర్చలు ఫలిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రేయిన్ నుంచి భారత పౌరుల(Indian Citizens)ను తరలించడంలో చేస్తున్న సహాయానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే సుమీ ప్రాంతంలో చిక్కుకున్న భారత పౌరులను సురక్షితంగా తరలింపులోనూ ఈ సాయం కొనసాగాలని జెలెన్ స్కీని కోరారు ప్రధాని మోడీ.

యుద్ధం మొదలై ఇప్పటికి 12 రోజులు.. ఇప్పటికే వేలాది మంది సైనికులతో పాటు పదుల సంఖ్యలో చిన్నారుల దుర్మరణం ఎన్నో ఆస్తుల నష్టం. లక్షలాది పౌరులు పొరుగుదేశాలకు వలస వెళ్తున్న హృదయ విదారక దృశ్యం. ఆకలి దప్పులకు అలమటిస్తూ.. అలసి సొలసి ప్రయాణిస్తున్నా లేని ఫలితం. కంటి నిండా నిద్రలేక కడుపు నిండా తిండిలేక పొరుగు దేశాల బాట పడుతున్న ఉక్రేయిన్ల బాధ వర్ణనాతీతం. ఒకరిద్దరి తప్పులకు ఎంతో మందికి మరణశిక్షా తప్పడం లేదు. మరోవైప, ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి దారితీసేంత దారుణమైన కక్షాను రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుత్ ఎందుకు పెంచుకున్నారో అర్థం కావడంలేదు. పుతిన్ విడనాడు నీ వితండ వాదాన్ని అంటూ ప్రపంచమంతా గగ్గోలు పెడుతున్న వేళ.. మూడో దఫా శాంతి చర్చలు ఫలిస్తాయో లేదోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది.

ఉక్రెయిన్‌లో రక్తపుటేరులు పారుతున్నాయి ఇది పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆవేదన. రష్యా దాడుల్లో ఇప్పటి వరకూ 38మంది పిల్లల మృతి చెందారనీ ఇది ప్రపంచానికెంతో హానికరమన్నది పోప్ ఫ్రాన్సిస్ వ్యక్త పరుస్తున్న ఆందోళన. రష్యా ఉక్రేయిన్ పై చేస్తున్న యుద్ధంపై రష్యా ఇంటలిజెన్స్ అధికారి రాసిన లేఖ ఒకటి.. విడుదలైంది. దీని అర్ధమేంటంటే.. ఉక్రేయిన్ పై రష్యా యుద్ధ లక్ష్యం నెరవేరడం కష్టం. ఇప్పటి వరకూ 10వైలకు పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఏం జరుగుతోందో. ఏం జరగబోతుందో అర్ధం కావడం లేదు. ఒక ప్లానింగ్ లేకుండా సాగుతున్న ఈ యుద్ధం ఖచ్చితంగా ప్రపంచ సంక్షోభానికి దారి తీసే అవకాశముంది. అంతే కాదు ఈ విషయంలో రష్యా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశముంది. ఇప్పటికే రష్యాను ఒక విలన్ లా చూస్తున్నారు. అంతెందుకు.. మన దేశంలోనే ఎందరో రష్యన్లు తీవ్ర నిరసన ర్యాలీలు తీస్తున్నారు. దీంతో స్టాప్ హేటింగ్ రష్యా అంటూ కొందరు రష్యా ప్రేమికులు కొత్త కేంపెయిన్ మొదలు పెట్టారంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

కేవలం సామాన్యులు మాత్రమే కాదు.. దేశ విదేశాల్లోనూ రష్యాకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. సాధారణ పౌరుల నుంచి వరల్డ్ బ్యాంక్ లో రష్యా సలహాదారు వరకూ యుద్ధానికి వ్యతిరేకమే. రష్యాలోని పెద్ద పెద్ద కంపెనీలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఉక్రెయిన్ ని హస్తగతం చేసుకోవడం మాట అటుంచి పుతిన్ కి స్వదేశంలోనే సవాలు ఎదురు కానుంది. ఈ పరిస్థితుల్లో ఉక్రేయిన్ రష్యాల మధ్య మూడో దశ శాంతి చర్చలు జరగనున్నాయని ఉక్రేయిన్ అధ్యక్ష సలహాదారు ప్రకటించారు. అదే సమయంలో రష్యాపై ఆంక్షలను పెంచాలని కోరుతోంది ఉక్రేయిన్. ఒక పక్క రష్యాపై ఆంక్షలు పెంచాలని కోరుతూనే మరో పక్క శాంతి చర్చలు సాగించడం సాధ్యమేనా? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు ఈ చర్చలు విఫలమయ్యాయి. కారిడార్ల నిర్మాణంపై ఏకాభిప్రాయం కుదిరినా ఇరు దేశాలకు బెలారస్ సహకరించడం లేదని తెగేసి చెబుతోంది.

అయితే ఈసారి చర్చలు ఎక్కడ జరుగుతాయి అనేదానిపై ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంతకు ముందే బెలారస్‌ చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించలేదు. ఎట్టకేలకు ఒప్పుకున్నా ఆ చర్చలు ఆశించనంత స్థాయిలో ఫలించలేదు. బెలారస్ అధ్యక్షుడు ఇటు ఉక్రెయిన్‌కు, అటు రష్యాకు కూడా సహకరించనని తెగేసి చెప్పారు. ఈ క్రమంలో మూడో దశ చర్చలు బెలారస్ వేదికగా జరుగుతాయా అన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి వేదిక మారే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఇరు దేశాల మ‌ధ్య జరిగిన రెండు రౌండ్ల చర్చల్లో పౌరుల కోసం సుర‌క్షిత కారిడార్ల నిర్మాణానికి ఏకాభిప్రాయం కుదిరింది.

అయితే ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం అయిన తర్వాత రష్యా తన దాడులను ఉధృతం చేసింది. నగరాలను హస్తగతం చేసుకునే దిశగా దాడులను పెంచింది. ఇప్పటికే చాలా నగరాల్లో ప్రజలు బంధీలుగా ఉన్న వార్తలు విన వస్తున్నాయి. ఈ క్రమంలో ర‌ష్యాపై మ‌రిన్ని క‌ఠిన ఆంక్షలు విధించాలని జెలెన్‌ స్కీ డిమాండ్ చేశారు. నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కోరుతున్నారు. రష్యా బలగాలకు ఉక్రెయిన్ త‌ల‌వంచితే తదుపరి బాల్టిక్ దేశాల వంతు వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మూడో దశ చర్చలు ఎంత వరకు ఫలిస్తాయి? అన్న విషయమై పలు అనుమానాలు వ్యక్తవమవుతున్నాయి. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సైనికులతో పాటు ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం అవసరం. ఏది ఏమైనా మూడో థఫా జరిగే చర్చలు ఫలించాలని ఆశిస్తున్నాయి ప్రపంచ దేశాలు.

మొత్తం మీద ఈ మూడో చర్చల సారాంశమేంటంటే.. సింగిల్ ఎజెండా యుద్ధాన్ని విరమించాలని ఉక్రేయిన్ కోరుతుంటే. ఉక్రేయిన్ నాటో సభ్యత్వాన్ని తీసుకోకూడదని డిమాండ్ చేస్తోంది రష్యా. గత రెండు సార్లు జరిగిన చర్చల్లోనూ ఇదే సింగిల్ పాయింట్ ఎజెండా. ఇప్పుడూ అదే ఎజెండా. ఈసారికి ఈ షరతులేవీ లేకుండా కేవలం పౌర ప్రయోజనాల కోసమే ఈ చర్చలు జరపాలన్నది ప్రపంచ దేశాల డిమాండ్. పశ్చిమ దేశాల రష్యాపై ఆంక్షలు విధించడం యుద్దం ప్రకటించడం లాంటిదేనన్నారు అధ్యక్షుడు పుతిన్. అంతే కాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించే ప్రయత్నం చేస్తే యుద్ధంలోకి దిగినట్లేనని హెచ్చరించింది రష్యా. రష్యా యుద్దం వల్ల ఇప్పటికే సుమారు 15 లక్షల మంది శరణార్ధులను పశ్చిమ దేశాల వైపు యూరోపియన్ యూనియన్ లోకి వెళ్లేటట్లు చేసింది.

ఇదిలా వుంటే చర్చలకు రెడీ అవుతున్న వేళ ఉక్రెయిన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది రష్యా. ఇప్పటివరకూ జరిగిన చర్చలకు ఉక్రెయిన్ ప్రతినిధిగా వచ్చిన డెనిస్ కిరీవ్ ను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ కాల్చి చంపిందని ఆరోపిస్తోంది రష్యా. రష్యాకు సమాచారం లీక్ చేస్తున్నాడన్న ఆరోపణలతో డెనిస్ కిరీవ్ ను అరెస్ట్ చేసేందుకు ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ప్రయత్నించారని, ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో కిరీవ్ మరణించాడని చెబుతున్నాయి రష్యా వర్గాలు. రష్యా ఉక్రెయిన్ మధ్య బెలారస్ లో చర్చలు జరిగిన సమయంలో డెనిస్ కిరీవ్ చివరిసారిగా దర్శనమిచ్చాడు. అయితే, అతడ్ని సెక్యూరిటీ దళాలు కాల్చి చంపాయన్న రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read Also…. 

Russia-Ukraine War: ఉక్రెయిన్‌ కీవ్‌, చెర్నిహివ్‌లో మరోసారి సైరన్‌ మోత.. మిగిలిన భారతీయుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్ గంగా!

Cooking oil price: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం… మన వంటింట్లో మంట.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు