ఢిల్లీలో హై అలర్ట్.. రిపబ్లిక్ డే వేళ ఉగ్రముప్పు.. భద్రతాదళాల మాక్ డ్రిల్..

ఒకవైపు దేశమంతా మువ్వన్నెల పండుగకు ముస్తాబవుతుంటే.. పొరుగు దేశాల నుంచి ఉగ్రకుట్రలు ఆందోళన కలిగిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని ఖలిస్తానీ, బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా అప్రమత్తమైంది.

ఢిల్లీలో హై అలర్ట్.. రిపబ్లిక్ డే వేళ ఉగ్రముప్పు.. భద్రతాదళాల మాక్ డ్రిల్..
Republic Day 2026 Delhi Security

Updated on: Jan 17, 2026 | 6:34 PM

దేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఉగ్రవాద సంస్థలు అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్తానీ సానుభూతిపరులు, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర ముఠాలు ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని నివేదికలు రావడంతో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. విదేశాల్లో తలదాచుకుంటున్న ఖలిస్తానీ రాడికల్ కార్యకర్తలు, స్థానిక గ్యాంగ్‌స్టర్లతో చేతులు కలపడం ఇప్పుడు భద్రతా సంస్థలకు సవాలుగా మారింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ-NCR, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లోని నేరస్థులను విదేశీ ఉగ్రవాద సంస్థలు తమ పావులుగా వాడుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దేశ అంతర్గత భద్రతను అస్థిరపరిచేందుకు ఈ టెర్రర్-గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్ ప్రయత్నిస్తోందని అధికారులు స్పష్టం చేశారు.

సున్నిత ప్రాంతాల్లో పోలీసుల మాక్ డ్రిల్స్

ఉగ్ర ముప్పు నేపథ్యంలో ఉత్తర ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అత్యంత రద్దీగా ఉండే, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా సంసిద్ధతను అంచనా వేయడానికి నాలుగు ప్రధాన మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఎర్రకోట, ISBT కాశ్మీరీ గేట్, చాందినీ చౌక్, ఖారీ బావోలీ, సదర్ బజార్, మెట్రో స్టేషన్లు వంటి ప్రదేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను బలోపేతం చేయడం, అత్యవసర సమయంలో ప్రజలు, ఏజెన్సీలు ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు.

కనువిందు చేయనున్న 30 శకటాలు..

మరోవైపు కర్తవ్య పథ్‌లో జరగనున్న గణతంత్ర పరేడ్ కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది పరేడ్‌లో సుమారు 30 శకటాలు భారత్ యొక్క సాంస్కృతిక వైభవాన్ని, అభివృద్ధిని చాటిచెప్పనున్నాయి. స్వేచ్ఛ మంత్రం – వందేమాతరం, శ్రేయస్సు మంత్రం – స్వావలంబన భారతదేశం థీమ్‌తో ఈ వేడుకలు జరగనున్నాయి. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది వేడుకలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సరిహద్దుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేయడంతో పాటు డ్రోన్ల సంచారంపై నిషేధం విధించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..