Kishan Reddy: ఏది చిన్న యుద్దం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

ఆపరేషన్ సింధూర్ చిన్న యుద్ధమేనన్న కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడి మాటలు దుర్మార్గంగా ఉన్నాయన్నారు.,‘ఆపరేషన్ సింధూర్’ ను చిన్న యుద్ధం అని పేర్కొన్న ఆయన మన సైనికుల సత్తాను తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారని మండిపడ్డారు.

Kishan Reddy: ఏది చిన్న యుద్దం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
G Kishan Reddy

Edited By: Shaik Madar Saheb

Updated on: May 21, 2025 | 8:50 AM

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ దేశంలోని ఎందరికో స్పూర్తిగా నిలుస్తుంది. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌కు భారత దేశం సత్తా ఏంటో చూపించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. 26 మంది పర్యాటకు ప్రాణాలు కాపాడడంతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ఈ ఉగ్రదాడి గురించి మోదీకి ముందే సమాచారం ఉందని.. అందుకే ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టు ఆయన రోపించారు.. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్‌ చిన్న యుద్ధమేనని ఆయన అన్నారు.

అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యస్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖర్గే వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ఖర్గే మాటలు దుర్మార్గంగా ఉన్నాయని..ఆపరేషన్ సింధూర్ ను చిన్న యుద్ధం అని పేర్కొన్న ఆయన మన సైనికుల సత్తాను తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారని మండిపడ్డారు.పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? అని ప్రశ్నించారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 11 మిలటరీ బేస్‌లను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా?.. 20 శాతం పాకిస్తాన్ మిలటరీ మౌలికవసతులను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా?.. చైనా అభివృద్ధి చేసిన అత్యాధునిక మిలటరీ రాడార్, మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను.. మన సైంటిస్టులు తయారుచేసిన మిసైల్స్ ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా?, భారత్‌ ఈ దెబ్బకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరై.. దయచేసి ఉద్రిక్తతలు ఆపుదామని కాళ్లబేరానికి రావడం చిన్న యుద్ధమా? అని ఆయన ధ్వజమెత్తారు.

‘ఆపరేషన్ సింధూర్’ గొప్పతనాన్ని భారతదేశం సహా యావత్ ప్రపంచం హర్షిస్తే.. కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆర్మీ బలోపేతాన్ని విస్మరించారు. అధికారాన్ని కోల్పోయినా.. ఆర్మీ సాధిస్తున్న విజయాలను స్వాగతించలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఇది కాంగ్రెస్ దివాళాకోరు మనస్తత్వానికి, మానసిక రుగ్మతకు నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..