రాష్ట్రపతి పదవిని స్వీకరించిన అనంతరం మొదటిసారిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం యూపీలోని తన జన్మ భూమిని సందర్శించారు. కాన్పూర్ దేహట్ జిల్లాలోని పారుంఖ్ గ్రామానికి చేరుకోగానే పులకించిపోయిన ఆయన..ఈ గ్రామ నేలను తాకి శిరసు వంచి నమస్కరించారు. హెలిపాడ్ వద్ద యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఈ గ్రామంలో జరిగిన జన అభినందన్ సమారోహ్ లో మాట్లాడిన రామ్ నాథ్ కోవింద్…దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలవుతోందని…కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ రక్షణ కవచంలా పనిచేస్తుందని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా ఈ గ్రామ స్మృతులు తనవెంటే ఉంటాయని…ఈ నేల తాలూకు వాసన… ఈ గ్రామస్థులతో తాను గడిపిన క్షణాలు తన హృదయంలో ఎప్పుడూ ఉంటాయన్నారు. పారుంఖ్ అన్నది కేవలం ఒక గ్రామం కాదని….ఇది తన మాతృభూమి అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇలాంటి గ్రామంలో ఓ సామాన్య బాలుడిగా ఉన్న తాను ఈ దేశ రాష్ట్రపతి వంటి అత్యున్నత స్థాయి పదవిని అలంకరిస్తానని అనుకోలేదని ఆయన చెప్పారు. అంటే మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ దీన్ని చేసి చూపిందని ఆయన పేర్కొన్నారు. కాగా యూపీలో రాష్ట్రపతి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. లక్నోలో ఆయన సోమవారం డా. బీ.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ నిర్మాణానికి శంకు స్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొనవచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి: మళ్ళీ సాధారణ పరిస్థితికి చేరుకుంటున్న హస్తిన…. ఢిల్లీలో 89 కోవిద్ కేసులు…. వారంలో మూడో సారి