జైపూర్: 42 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎన్నాళ్లు ఎదురు చూసినా అతను తిరిగిరాలేదు. దీంతో అతను చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. కోర్టులో డెత్ సర్టిఫికేట్ కూడా పొందారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత నేను బతికే ఉన్నానంటూ వచ్చాడా వ్యక్తి. ఈ విచిత్ర సంఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో మంగళవారం (మే 30) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా బన్సూర్ గ్రామానికి చెందిన హనుమాన్ సైనీ (75)కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1989లో ఢిల్లీలోని ఓ షాప్‌లో పనికి వెళ్లిన అతను కనిపించకుండా పోయాడు. ఎవరికీ చెప్పకుండా ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు వెళ్లిపోయారు. అక్కడ హిమాలయాల్లోని మాతా మందిరంలో పూజలు చేస్తూ సాదు జీవితాన్ని గడిపాడు. దాదాపు 34 ఏళ్ల తర్వాత 75 ఏళ్ల వయసులో ఢిల్లీకి తిరిగి వచ్చాడు. ఐతే ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా మారిపోయి ఉండటంతో తన ఇల్లు, అయిన వాళ్లను గుర్తుపట్టలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఓ స్నేహితుడి సహాయంతో అక్కడి నుంచి స్వగ్రామం బన్సూర్ చేరుకున్నారు. చాలాకాలం తర్వాత హనుమాన్ సైనీ ఇంటికి రావడంతో అతని కుటుంబ సభ్యులతో ఊరంతా అవాక్కయ్యారు. ఐతే హనుమాన్ సైనీ మాత్రం ఎవ్వరినీ గుర్తుపట్టలేక పోయాడు. చివరికి ఆయన తన భార్య దుర్గాదేవిని గుర్తుపట్టడంతో కథ సుఖాంతమైంది.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆశ్చర్యంతో ఆయన ఇంటి చుట్టూ గుమికూడారు. నిజానికి.. అతను మృతి చెంది ఉంటాడని, ఇక ఎప్పటికీ తిరిగిరాడేమోనని హనుమాన్ సైనీ కుమారుడు రామ్‌చంద్ర గతేడాది డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాడు. తండ్రి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఎన్నో రోజులు వెతికామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతని ఆచూకీ లభించకపోవడంతో మరణించి ఉండాటని భావించినట్లు అతను చెప్పుకొచ్చాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.