AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటక కుల గణనపై గందరగోళం.. రాహుల్ గాంధీ వ్యూహం బెడిసికొట్టిందా?

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కుల గణన రాజకీయంగా ఇబ్బందులను కలిగిస్తోంది. 'జిత్నీ ఆబాదీ ఉత్నా హక్' నినాదంతో రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన ఈ వ్యూహం, వొక్కలిగ, లింగాయత్ వంటి ప్రభావవంతమైన కులాల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నివేదిక అమలు లేదా నిలిపివేత రెండూ కాంగ్రెస్‌కు రాజకీయ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. బీజేపీ ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటోంది.

కర్ణాటక కుల గణనపై గందరగోళం.. రాహుల్ గాంధీ వ్యూహం బెడిసికొట్టిందా?
Rahul Gandhi On Karnataka Census
Mahatma Kodiyar
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 22, 2025 | 9:53 PM

Share

భారతీయ జనతా పార్టీ (BJP) మత రాజకీయాలు చేస్తుందని పదే పదే ఆరోపించే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల్లో ఆ పార్టీని ఎదుర్కోడానికి ‘కులం’ ఆయుధంగా మార్చుకున్నారు. ప్రత్యర్థిని గాయపరచాల్సిన ఈ ఆయుధం కాంగ్రెస్ పార్టీనే ఇరకాటంలో పడేస్తోంది. ఇందుకు కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణ. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ‘జిత్నీ ఆబాదీ ఉత్నా హక్’ (ఎంత జనాభా ఉంటే అంత వాటా) అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. కుల గణన ఆధారంగా రాజకీయ ప్రాతినిధ్యాన్ని అందించాలనే ప్రజాదరణ పొందిన వాగ్దానాన్ని ముందుకు తెచ్చారు. ఈ వ్యూహం తెలంగాణలో అటూ ఇటుగా అమలైనప్పటికీ, కర్ణాటకలో మాత్రం రాజకీయ గండంగా మారింది. కర్ణాటకలోని కుల గణన నివేదిక చుట్టూ జరుగుతున్న వివాదం కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.

రాజకీయ ఆయుధంగా మారిన సామాజిక సర్వే

కర్ణాటకలో కుల గణన అంశం ఈనాటిది కాదు. 2013-18 మధ్య సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాజిక-ఆర్థిక సర్వే రూపంలో ప్రారంభమైంది. అయితే, ఈ అప్పుడు తయారైన నివేదిక రాజకీయ కారణాల వల్ల దాదాపు దశాబ్ద కాలం పాటు అటకెక్కింది. 2024లో రాహుల్ గాంధీ లేవనెత్తిన నినాదంతో ఈ నివేదిక మళ్లీ రాజకీయ చర్చలోకి వచ్చింది. అయితే ఇది సామాజిక సంక్షేమ సంస్కరణల కంటే ఎన్నికల సాధనంగా మారినట్లు కనిపిస్తోంది. ఈ నివేదికను అమలు చేయాలనే నిర్ణయంపై ఏప్రిల్ 17న కేబినెట్ చర్చించాల్సి ఉండగా, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా దానిని మే 2కి వాయిదా వేశారు. ఈ వాయిదా కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత అసంతృప్తిని, రాష్ట్రంలోని రాజకీయ సంక్లిష్టతలను సూచిస్తుంది.

వొక్కలిగలు, లింగాయత్‌ల వ్యతిరేకత!

కర్ణాటక రాజకీయాల్లో వొక్కలిగలు, లింగాయత్‌లు ప్రభావవంతమైన కుల సమూహాలు. వొక్కలిగ సంఘానికి చెందిన ఒక అధికారి, కుల గణన నివేదికను అమలు చేస్తే ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బెదిరించడం తీవ్రతను తెలియజేస్తుంది. రాష్ట్రంలో వొక్కలిగలు, లింగాయత్‌లు గ్రామీణ కర్ణాటకలో సామాజికంగా, ఆర్థికంగా ఇతర కులాలపై ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. రాజకీయాలు సైతం ఈ రెండు సమూహాల చుట్టే తిరుగుతుంది. కుల గణన ద్వారా ఈ సమీకరణాలు మారితే, కాంగ్రెస్‌కు ఈ సముదాయాల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉంది.

అదే సమయంలో బీజేపీ దళితులు, గిరిజన సముదాయాలలో తమ పట్టును బలోపేతం చేసుకుంటోంది. ఈ పరిణామం కాంగ్రెస్‌ ఉనికికే ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. సరికొత్త సంక్షోభాన్ని సృష్టిస్తోంది. సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే భూ కేటాయింపుల కుంభకోణం, హనీట్రాప్ వివాదం వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఇలాంటి సమయంలో కుల గణనపై నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా మరింత ప్రమాదకరంగా మారవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రాహుల్ గాంధీ వ్యూహం: లాభనష్టాలు

రాహుల్ గాంధీ ఈ నినాదం ద్వారా కాంగ్రెస్ పార్టీని బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా నిలపాలని భావించారు. 2014 నుంచి గాంధీ కుటుంబం ఓట్లను ఆకర్షించడంలో విఫలమవుతున్న నేపథ్యంలో కుల గణన, ‘జనాభా నిష్పత్తికి తగ్గ వాటా’ ఆలోచన ద్వారా రాజకీయ సమీకరణాలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వ్యూహం తెలంగాణలో ముందుకు సాగినప్పటికీ.. కర్ణాటకలోని సంక్లిష్ట కుల రాజకీయాలు దీనిని అడ్డుకుంటున్నాయి. కాంగ్రెస్ ఈ నివేదికను అమలు చేస్తే, వొక్కలిగలు, లింగాయత్‌ల నుంచి తిరుగుబాటు ఎదుర్కొనే అవకాశం ఉంది. అమలు చేయకపోతే, రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో చేస్తున్న నినాదం బలహీనపడే ప్రమాదం ఉంది. ఈ రెండింట్లో ఏది చేసినా కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం కలిగించేవే.

మండల్ 2.0 కలలు నీటిబుడగలేనా?

రాహుల్ గాంధీ ఈ వ్యూహాన్ని మండల్ కమిషన్ రెండవ రూపంగా (మండల్ 2.0) భావిస్తున్నారు. 1990లలో మండల్ కమిషన్ ఓబీసీలకు రిజర్వేషన్లను తెచ్చిన విధంగా, కుల గణన ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించవచ్చని ఆయన ఆశిస్తున్నారు. అయితే కర్ణాటకలో ఈ ప్రయత్నం రాజకీయ లెక్కలను సంక్లిష్టం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభావవంతమైన కుల సమూహాలు ఈ మార్పును వ్యతిరేకిస్తుండటం, అంతర్గత పార్టీ అసంతృప్తి, బీజేపీ యొక్క వ్యూహాత్మక ప్రతిఘటనలు కాంగ్రెస్‌ను ఒక సందిగ్ధంలో నిలిపాయి. నిజానికి మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు రిజర్వేషన్లను ప్రతిపాదించినప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా వ్యతిరేకించినట్టు ఆరోపణలున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో ఉన్నంత పట్టు ఓబీసీ వర్గాల్లో లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో మండల్ 2.0 ద్వారా ఓబీసీ సమూహాలకు దగ్గరవ్వాలన్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు.

రాహుల్ గాంధీ ‘జిత్నీ ఆబాదీ ఉత్నా హక్’ నినాదం ఆకర్షణీయమైన వాగ్దానంగా కనిపించినప్పటికీ కర్ణాటకలోని వాస్తవ రాజకీయ పరిస్థితులు దీనిని అమలు చేయడాన్ని సవాలుగా మార్చాయి. కాంగ్రెస్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందనేది రాష్ట్రంలో దాని భవిష్యత్తును మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ రాజకీయ వ్యూహాల విజయాన్ని కూడా నిర్దేశిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..