Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పర్యటన..

ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఘనస్వాగతం లభించింది. 8 మంది మంత్రుల బృందంతో భారత్‌ చేరుకున్న పుతిన్‌.. ఇవాళ కీలక సమావేశాల్లో పాల్గొంటారు. హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీ, పుతిన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఇరు దేశాల మధ్య 25 ఒప్పందాలు జరగనున్నాయి.

Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పర్యటన..
Pm Modi - Putin

Updated on: Dec 04, 2025 | 10:25 PM

రెండు రోజుల పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఢిల్లీ చేరుకున్నారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి పాలం ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. ఆప్యాయంగా పుతిన్‌ను ఆలింగనం చేసుకున్నారు. పుతిన్‌కు మోదీ స్వాగతం పలుకుతారని ఊహించలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ ప్రెకటించింది. అనంతరం అక్కడి నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నారు. పుతిన్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు.

భారత పర్యటనలో భాగంగా రాజ్‌ఘాట్‌ను పుతిన్‌ సందర్శిస్తారు. రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అధికారిక స్వాగత కార్యక్రమం ఉంటుంది. హైదరాబాద్‌ హౌస్‌లో శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, పుతిన్‌ పాల్గొంటారు. భారత్‌-రష్యా మధ్య 25 ఒప్పందాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ- రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇండియా-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు.

భారత్‌తో సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురుచూస్తోందని పుతిన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం తదితర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భారత్‌ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైనా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందు 2021 డిసెంబరులో పుతిన్‌ చివరిసారి ఢిల్లీ వచ్చారు. ఆ తర్వాత భారత్‌కు రావడం ఇదే తొలిసారి. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు విధిస్తోంది. ఈ క్రమంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.