Punjab Congress Crisis: పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదురుతోంది. సిద్ధూను రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా నియమిస్తే పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం సమిసిపోతుందని ఆశించిన కాంగ్రెస్ హైకమాండ్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. సమస్య పరిష్కారం కాకపోగా.. మరింత జఠిలంగా మారుతోంది. ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ సిద్ధూ ఢీ అంటే ఢీ అంటున్నారు.. తెగేదాకా లాగుతున్నారు. సీఎం పదవి నుంచి అమరీందర్ సింగ్‌ను తప్పించాలంటూ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల తిరుగుబావుటా ఎగురవేసిన నేపథ్యంలో పార్టీ అధిష్టానంపై సిద్ధూ ధిక్కార స్వరం వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజా పరిణామాల నేపథ్యంలో అమృతసర్‌లో తన మద్ధతుదారులతో సిద్ధూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన మద్ధతుదారులనుద్దేశించి కాస్త ఆవేశంగా మాట్లాడారు. పీసీసీ చీఫ్‌గా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తనకు ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ను కోరినట్లు తెలిపారు. నిర్ణయాలు తీసుకోలేని డమ్మీ అధ్యక్షుడిగా తాను ఉండలేనని స్పష్టంచేశారు. లేనిపక్షంలో తగిన రీతిలో బదులు ఇవ్వాల్సి ఉంటుందంటూ సిద్ధూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిర్ణయాలు తీసుకునే అధికారమిస్తే వచ్చే రెండు దశాబ్ధాల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెలుగొందేలా చేస్తాను.. లేకపోతే తాను ఎవరినీ వదిలిపెట్టనంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా అండతోనే సిద్ధూ పంజాబ్ పీసీసీ చీఫ్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. సిద్ధూను పీసీసీ చీఫ్‌గా నియమించిన తర్వాత పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సిద్ధూ, అమరీందర్ మద్ధతుదారులు రెండు వర్గాలుగా చీలిపోయి బహిరంగ విమర్శలు చేసుకోవడం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని అంటున్నారు.
అమరీందర్ సింగ్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన మంత్రులు, ఎమ్మెల్యేల వెనుక సిద్ధూ ఉన్నారంటూ అమరీందర్ సతీమణి, ఎంపీ ప్రణీత్ కౌర్ ఆరోపించారు. అసమ్మతి నేతలు ఢిల్లీకి వెళ్తున్న విషయం తెలుసుకున్న అమరీందర్ సింగ్ వర్గం గురువారం రాత్రి డిన్నర్ పార్టీ వేదికగా బలప్రదర్శన చేపట్టింది. అమరీందర్‌కు సన్నిహితుడైన మంత్రి ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు హాజరైయ్యారు. దీంతో పార్టీలో మెజార్టీ నేతలు తనవెంటే ఉన్నారని అమరీందర్ సింగ్ పార్టీ హైకమాండ్‌కు సంకేతాలు పంపారు.
Also Read..
Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! ఇక నుంచి ఏసీ కోచ్‌లో ప్రయాణం చాలా చౌక..
Afghanistan Crisis: అమెరికా పవర్ కౌంటర్.. అఫ్గాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ సభ్యుడిపై వైమానిక దాడి