
పూణె, జూన్ 16: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఇంద్రాణి నదిపై ఉన్న పురాతన వంతెన ఆదివారం (జూన్ 15) కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 51 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పుణె ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన పాత కట్టడం. ఇది శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడి కుండ్మాల గ్రామం సమీపంలోని నదిపైన ఉన్న కట్టడం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వంతెన కూలిపోయింది.
ఈ సంఘటన పూణే నుండి 30 కి.మీ దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన తలేగావ్‌లోని కుండ్ మాలా సమీపంలో జరిగింది. ఇది సహజ సింక్‌హోల్స్, లోయలు, ప్రత్యేకమైన రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఉప్పొంగుతున్న నదిని చూడటానికి పాత వంతెన పైకి ఒక్కసారిగా 125 మంది గుమి గూడారు. అయితే వరద ప్రవాహం ధాటికి వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. వంతెన శిధిలావస్థకు చేరుకోవడంతో గతంలోనే వంతెనపై రాకపోకలు నిలిపివేయడం జరిగింది. అయితే వరద ప్రవాహాన్ని చూడడానికి బ్రిడ్జిపై ప్రజలు గుమిగూడటంతో ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, గ్రామస్తులు, విపత్తు సహాయ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కింద శిధిలాల కింద పడి మృతి చెందిన వారి డెడ్‌బాడీలను వెలికి తీశారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వంతెన కూలిన ఘటనపై దేవేంద్ర ఫడ్నవీస్ తో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రధాని, కేంద్ర హోం మంత్రి సంతాపం తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముగిసినట్లు జాతీయ విపత్తు సహాయ దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) సోమవారం తెలిపింది. నలుగురు మృతి చెందినట్లు నిర్ధారించగా, ఇద్దరి మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.