PM Modi: కార్గిల్‌లో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు.. జవాన్లతో పండుగ చేసుకోవడం అదృష్టమంటూ..

ఏటా సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మరోసారి తన సాంప్రదాయాన్ని కొనసాగించారు..

PM Modi: కార్గిల్‌లో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు.. జవాన్లతో పండుగ చేసుకోవడం అదృష్టమంటూ..
Pm Modi Reaches Kargil To Celebrate diwali

Updated on: Oct 24, 2022 | 11:45 AM

ఏటా సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మరోసారి తన సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ ఏడాది కూడా దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులతో కలిసి జరుపుకునేందుకు ప్రధాని మోదీ కార్గిల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. కార్గిల్‌లోని సైనికులతో కలిసి ప్రధాని దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొంటారని పేర్కొంది.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. దేశరక్షణలో సైన్యం సేవలు మరువలేనివని కొనియాడారు. దేశభక్తి దైవభక్తితో సమానమని తెలిపారు. సైనికుల వల్లే దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారని.. ఆర్మీ బలగాలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. సైనికులు దేశాన్ని కాపాడే రక్షణ స్తంభాలు అని ప్రధానమంత్రి అభివర్ణించారు. జవాన్లతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అని చెప్పారు. అనంతరం జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ స్వీట్లు పంచారు.

సైనికుల వల్లే దేశంలో శాంతి, భద్రతలు నెలకొన్నాయని.. అందుకోసం వారు సర్వశక్తులా ఒడ్డిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్నారని జవాన్లపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. సైనిక కుటుంబ సభ్యులంతా తన కుటుంబ సభ్యులేనని అన్నారు. వారి పిల్లల కోసం అనేక సైనిక స్కూల్స్‌ తెరిచామని చెప్పారు. భారత్‌ దగ్గర ఉన్న స్వదేశీ ఆయుధాలు అత్యంత శక్తివంతమైనవి అని అన్నారు. భారత్ ఎప్పుడూ యుద్ధం అనేది చివరి ప్రయత్నంగా చూస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. 2014లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అత్యంత రిమోట్ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లలో ఉన్న సైనిక సిబ్బంది జీవితాలను ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ సంవత్సరం దీపావళి రోజున దేశ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. సైనికులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. గతేడాది జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లోని సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగను జరుపుకోగా.. ఈసారి కార్గిల్‌లో ఆ వేడుకలు జరుపుకోనున్నారు.

దేశ ప్రజలకు ప్రధాని దీపావళి శుభాకాంక్షలు..

దీపావళి పర్వదినం అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన పండుగ మన జీవితాల్లో వెలుగు, ఆనందాలను నింపడమే కాదు.. సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నా. మీరు మీ కుటుంబం, స్నేహితులతో కలిసి అద్భుతమైన దీపావళిని జరుపుకోవాలని ఆశిస్తున్నాను’.