Modi In Bengaluru: రెండు రోజుల కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో నేరుగా బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్‌కు మధ్యాహ్నం 12.05 గంటలకు చేరుకున్నారు. అనంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చేరుకున్నారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన బ్రెయిన్ సెల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మోదీ ప్రారంభించారు. తర్వాత మధ్యాహ్నం 3.35 గంటలకు అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బెంగళూరు నుంచి మైసూరుకు హెలికాప్టర్‌లో వెళ్లనున్న ప్రధాని, 5.50కి మైసూరు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేసే బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
ఇక మంగళవారం జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు. అలాగే మైసూరు లోని సుత్తూరు మఠంలో వేదపాఠశాలను జాతికి అంకితం చేస్తారు. రైల్వేస్, నేషనల్ హైవే అధారిటీకి చెందిన వివిధ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇదిలా ఉంటే అగ్నిపథ్ పథకం విషయంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతోన్న తరుణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. భద్రత ఏర్పాట్లను భారీ ఎత్తున చేపట్టారు. మోదీ పర్యటించే ప్రాంతాలను ఒక రోజు ముందే పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
మోదీ పర్యటనకు ప్రాధాన్యత..
వచ్చే ఆరు నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్‌తో పాటు జేడీఎస్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తమ విజయాన్ని కొనసాగించాలని బీజేపీ చూస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి నుంచే మోదీ కర్ణాటకపై దృష్టిసారించారని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..