CBSE 12 Exam 2021: కరోనా రెండో వేవ్ నేపధ్యంలో విద్యార్ధుల పరిస్థితి అయోమయంగా తయారైంది. రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు ప్రస్తుతానికి వాయిదా వేశాయి. అయితే, కేంద్ర స్థాయిలో ఉండే 12వ తరగతి పరీక్షల విషయంలో ఇప్పటికీ గందరగోళం నడుస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ, విపక్షాలు మాత్రం పరీక్షలు రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాయి. కరోనా విపరీత పరిస్థితులలో చేజేతులా విద్యార్ధులను కరోనా కోరల్లోకి నెట్టవద్దని చాలామంది డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈరోజు (మంగళవారం) సాయంత్రం ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాలతోనూ ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన చెప్పబోయే నిర్ణయం కీలకంగా మారనుంది. ఇప్పటికే ఈ విషయంలో ఒక వైపు విద్యార్దులలోనూ, మరోవైపు వివిధ రాష్ట్రాల ప్రభుత్వ వర్గాల్లోనూ ఉత్సుకత నెలకొని ఉంది.
ప్రధాని సమావేశం నేపధ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కొద్ది సేపటి క్రితం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 12 వ తరగతి బోర్డులను రద్దు చేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. గత పనితీరు ఆధారంగా విద్యార్థుల పరీక్షల మార్కులు మదింపు చేసి ఫలితాలు ఇవ్వాలని ఆయన సూచించారు. అదేవిధంగా గత నెలలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా విద్యార్థులకు టీకాలు వేసే ముందు 12 వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించడం పెద్ద తప్పు అని కేంద్రానికి చెప్పారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పిలిచిన ఉన్నత స్థాయి సమావేశంలో సిసోడియా ఈ సూచన చేశారు.
అయితే, సిబిఎస్‌ఇ 12 వ తరగతి పరీక్ష 2021 నిర్వహించడంపై తన తుది నిర్ణయాన్ని ప్రకటించే ముందు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖారియల్ నిశాంక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల భద్రత మరియు భవిష్యత్తు నరేంద్రకు మోడీ ప్రభుత్వానికి ప్రధానం అని చెప్పారు. అదేసమయంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ దృష్టాంతంలో విద్యార్థుల కోసం సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వానికి పెద్ద సవాలు అని విద్యాశాఖ మంత్రి అంగీకరించారు. కానీ, 12 వ తరగతి బోర్డు పరీక్షల విషయానికి వస్తే, ఇది ప్రతి విద్యార్థి కెరీర్ గ్రాఫ్ అలాగే, జీవితానికి రోడ్‌మ్యాప్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అందుకే ఈ విషయంలో అన్ని సూచనలు పరిగణన లోకి తీసుకుని ప్రధాని మోడీ రాష్ట్రాలతో మాట్లాడనున్నట్టు వివరించారు.
మొత్తమ్మీద సిబిఎస్ఈ 12 వ తరగతి పరీక్షల నిర్వహణ విషయం మరి కొద్ది సేపట్లో తేలనుంది. ప్రభుత్వం రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణన లోకి తీసుకుంటుందా? లేక సమావేశంలో వచ్చే అభిప్రాయాలను మదింపు చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి మొదలైంది. కానీ, ఇంతకుముందు కేంద్ర మంత్రిత్వ శాఖ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టుకు జూన్ 3 లోగా తుది నిర్ణయం తీసుకుంటుందని తెలియజేసింది. అందుకోసం సమావేశంలోనే ఒక నిర్ణయం ప్రకటిస్తారా అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది.
ఏది ఏమైనా ఈ విషయంపై సస్పెన్స్ కొద్ది సేపట్లో వీడిపోనుంది.