Presidential Election 2022: గిరిజన అభ్యర్థి కోసం.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై మొదలైన బీజేపీ కసరత్తు..

Presidential Election 2022: గిరిజన అభ్యర్థి కోసం.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై మొదలైన బీజేపీ కసరత్తు..
bjp-parliamentary-board-meeting

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సహా పలువురు సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

Sanjay Kasula

|

Jun 21, 2022 | 8:42 PM

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. బుధవారం సాయంత్రం తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సహా పలువురు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. ఈ అత్యున్నత స్థాయి బీజేపీ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి పేరు ఎవరూ అనే అంశంపై చర్చించనున్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత రాష్ట్రపతి అభ్యర్థి పేరును బీజేపీ  ప్రకటించవచ్చని తెలుస్తోంది. పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. ఈ భేటీ తర్వాత ఆయన (నాయుడు)ని రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టే అంశాన్ని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) పరిశీలిస్తోందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గిరిజన అభ్యర్థి కోసం..

ప్రతిసారీ ఊహలకు, అంచనాలకు అందకుండా అభ్యర్థులను రంగంలోకి దించుతున్న మోదీ-షా ద్వయం ఈసారి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ ఇతర పార్టీలతో పాటు సొంత పార్టీలోనూ నెలకొంది. గత ఎన్నికల్లో రామ్‌నాథ్ కోవింద్‌ను అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపర్చారు ప్రధాని మోడీ. ఈసారి ఏ సమీకరణాలకు పెద్దపీట వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటి వరకు ఆదివాసీ-గిరిజనులకు దేశ ప్రథమ పౌరుడిగా ఎవరూ అవకాశం కల్పించలేదు. కాబట్టి, ఈసారి ఆదివాసీ సమూహానికి చెందిన నేతను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. పైగా ఆదివాసీ-గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని వ్యక్తులపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ గిరిజన నేతనే అభ్యర్థిగా ప్రకటించే పక్షంలో మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, చత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయ, కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, జ్యుయల్ ఓరంల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం కల్పించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లోనే ద్రౌపది ముర్ము పేరు వినిపించినప్పటికీ, దళిత సమీకరణాలకు పెద్దపీట వేయడంతో రామ్‌నాథ్ కోవింద్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. గిరిజనులకు అవకాశమివ్వాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తే ద్రౌపది ముర్ము పేరు ముందువరుసలో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికలపై మేధోమథనం

రాష్ట్రపతి ఎన్నికలపై మేధోమథనం చేసేందుకు ఆదివారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో నిర్వాహక బృందం సభ్యులు అందరూ పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి విషయంలో పార్టీ తరపున అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు అప్పగించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధినేత నితీశ్ కుమార్, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాతో సహా పలువురు సీనియర్ నేతలతో రాష్ట్రపతి అభ్యర్థి పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది.

విపక్షం తమ అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా 

మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈరోజు 19 ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును విపక్షాలన్నీ ఏకగ్రీవంగా బలపరిచాయి. యశ్వంత్ సిన్హా ఇప్పుడు జూన్ 27న రాష్ట్రపతి అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కొత్త రాష్ట్రపతి ఎన్నిక జులై 18న జరుగుతుందని మీకు తెలియజేద్దాం.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu