భారత తదుపరి (16వ) ఉపరాష్ట్రపతి ఎన్నికకు (Vice President Elections – 2022) పోలింగ్ ముగిసింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రక్రియ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించి, రాత్రి ఫలితం వెల్లడిస్తారు. ఈ ప్రక్రియ అంతా లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎన్డీయే కూటమి తరఫున బంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్ మార్గరెట్ ఆళ్వా ఉపరాష్ట్రపతి పోరులో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi), కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, అశ్వినీ వైష్ణవ్, పలువురు ఎంపీలు, మంత్రులు, మాజీ ప్రధానమంత్రి ఎంపీ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) తదితరులు ఓటు వేశారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీల్ ఛైర్ లో వచ్చారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకూ ఆయన వీల్ ఛైర్ పైనే వచ్చారు. మొత్తం 780 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. కాగా.. వీరిలో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 36 మంది సభ్యులు ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.
ఎన్డీయే అధికార కూటమి తరఫున పోటీలో ఉన్న జగదీప్ దన్ ఖడ్ గెలుపు లాంఛనంగా కనిపిస్తోంది. ఎన్డీయే, మిత్రపక్షాలకు స్పష్టమైన బలమున్నందున ఆయననే విజయం వరించే అవకాశం ఉంది. ఎన్డీయే కూటమికి 544 ఓట్లు లభించే సూచనలున్నాయి. ఎలక్టోరల్ కాలేజీ ప్రకారం 73% ఓట్లు ధన్‌ఖడ్‌కు రానున్నాయి. కాగా.. 2017 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికారకూటమి అభ్యర్థి వెంకయ్యనాయుడుకు 67.89% ఓట్లు దక్కాయి. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి 32.11% ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాల్లో ప్రధానమైన టీఎంసీ ఈ ఎన్నికల్లో పాల్గొనకపోవడం వల్ల ఆ కూటమికి ఓట్లలో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా.. భారత 15వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీ కాలం ఈ నెల 10 న ముగియనుంది. నూతన ఉపరాష్ట్రపతి ఈనెల 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ రోజు రాఖీపౌర్ణమి సెలవు రోజైనప్పటికీ ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగనుంది. 12 వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నందున చివరి రోజున కొత్త ఉప రాష్ట్రపతి ఛైర్మన్ హోదాలో సభను నిర్వహించే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..