Rajastan Election: రాజస్థాన్‌లో హోరెత్తుతున్న అగ్రనేతల ప్రచార ర్యాలీలు.. పార్టీల బ్రహ్మాస్త్రంగా మారిన కులగణన

రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. నవంబర్ 25న ఎన్నికలు జరగనుండటంతో.. అగ్రనేతలు బరిలోకి దిగారు. మరో రెండు రోజులు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉండటంతో.. కీలక నాయకులంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. కుల ప్రాతిపదికన ఓట్లు పొందేలా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

Rajastan Election: రాజస్థాన్‌లో హోరెత్తుతున్న అగ్రనేతల ప్రచార ర్యాలీలు.. పార్టీల బ్రహ్మాస్త్రంగా మారిన కులగణన
Narendra Modi, Rahul Gandhi

Updated on: Nov 21, 2023 | 9:29 PM

రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. నవంబర్ 25న ఎన్నికలు జరగనుండటంతో.. అగ్రనేతలు బరిలోకి దిగారు. మరో రెండు రోజులు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉండటంతో.. కీలక నాయకులంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. కుల ప్రాతిపదికన ఓట్లు పొందేలా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ ర్యాలీలతో హోరాహోరీ ప్రచారం కొనసాగుతోంది. నవంబర్ 25న ఎన్నికలు జరగనుండటంతో.. బీజేపీ, కాంగ్రెస్‌ ప్రచారంలోకి అగ్రనేతలు దిగారు. ఓటర్లను ఆకర్షించేందుకు కీలక హామీలు కురిపిస్తున్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌, ఎలాగైనా విజయం సాధించి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కుల ప్రాతిపదికన ఓట్లు పొందేలా.. పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్నాయి పార్టీలు..

రాజస్థాన్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఇప్పటికే పలు గ్యారంటీలను ప్రకటించగా, తాజాగా కులగణనను మేనిఫెస్టోలో చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు కులగణన ప్రస్తావన తీసుకొచ్చారు. అధికారంలోకి వస్తే తాము దేశవ్యాప్తంగా ఖచ్చితంగా కులాల వారీగా గణన చేపడతామన్నారు. తాజాగా ఇదే అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది.

కులాల పరంగా ఎక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్న రాజస్థాన్‌లో ఓబీసీ ఓటర్లే కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల ప్రధాన ఓటు బ్యాంక్‌..! దీంతో ఆ దిశగానే ఇరు పార్టీలు పాచికలు కదుపుతూ, తమదైన వ్యూహంతో ప్రచార ర్యాలీలు నిర్వహిస్తూ హామీలు కురిస్తున్నాయి. రాజస్థాన్‌లోని కోటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. దోపిడీదారులు, నేరస్తుల కబంద హస్తాల నుంచి రాజస్థాన్‌ను రక్షించాలన్నా ఆయన, అభివృద్ధి జరగాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు.

రాజస్థాన్‌లోని జాలోర్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఈ వివాదాస్పద కామెంట్‌ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ. వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాని మోదీయే కారణమన్నారు రాహుల్‌గాంధీ. గెలుపు ముంగిట ఉన్న జట్టు మోదీ స్టేడియంలోకి అడుగుపెట్టగానే ఓడిపోయిందన్నారు. మోదీ ఓ చెడు శకునం అన్నారు రాహుల్‌గాంధీ.

మరోవైపు, కుల ప్రాతిపదికన ఓట్లు పొందేలా పార్టీల వ్యూహాలు రచిస్తున్నాయి. రాజస్థాన్‌ అసెంబ్లీలోని 200 స్థానాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలో సుమారు 30% వరకు ఓబీసీ వర్గానికి చెందిన వారే. ఇక్కడ జాట్‌లే ఆధిపత్య ఓబీసీలు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు 17.8%, షెడ్యూల్డ్ గిరిజన తెగలు 13.5% ఉండగా, ఓబీసీ ఎంతమంది ఉన్నారనేది సంఖ్యాపరంగా కచ్చితమైన గణాంకాలు లేనప్పటికీ… సుమారు 30 నుంచి 40% దాక ఉంటారనే అంచనా. వీటన్నింటిని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు దృష్టిలో ఉంచుకునే, ఓబీసీలకు కాంగ్రెస్‌ 72, బీజేపీ 70 టిక్కెట్లు కేటాయించింది.

మొత్తానికి ఈ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్‌ పార్టీల్లో… ఎవరి ఎత్తుగడ, హామీలకు ఓటర్లు మొగ్గు చూపుతారో చూడాలి..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…