కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యింది. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య కొత్తమంత్రులు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేస్తారు. 20 మందికి పైగా కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారు. అయితే కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆరుగురికి కేబినెట్ పదవులు దక్కే అవకాశాలున్నాయి. యువత, ఉన్నత విద్యావంతులకు విస్తరణలో పెద్దపీట వేయాలని ప్రధాని నిర్ణయించారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు కూడా ప్రాథాన్యత లభించబోతోంది. ముఖ్యంగా యూపీకి ఎక్కువ పదవులు దక్కే అవకాశం ఉంది. మిత్రపక్షాల విషయానికొస్తే జేడియూకు కచ్చితంగా అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. తమకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని బీహార్ సీఎం నితీష్‌కుమార్ ప్రధాని మోదీని కోరినట్టు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింథియా, అసోం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీలకు..మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇక దిలీప్ ఘోష్, నాంగ్యాల్, మనోజ్ తివారీకి చోటు దక్కే అవకాశముంది. ఎల్జేపీలో తిరుగుబావుటా ఎగురవేసిన పశుపతి పరాస్,అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్ తదితరులకు కేబినెట్ బెర్త్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఐతే ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల ఓటర్లను దృష్టిలో పెట్టుకుని మంత్రులను ఖరారు చేసినట్లు సమాచారం. మహారాష్ట్ర నుంచి నారాయణ్‌రాణేకు మంత్రిపదవి ఖాయమంటున్నారు. బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీకి కూడా మంత్రిపదవి దక్కే అవకాశముంది.
2019లో మోదీ రెండో విడత ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకూ మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. నిబంధనల ప్రకారం..కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కేబినెట్‌లో 53 మంది మాత్రమే ఉన్నారు. చాలా మంత్రుల వద్ద ఒకటికంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలున్నాయి. దీంతో మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టారు ప్రధాని మోది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే అసోం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా , నారాయణ్ రాణే ఢిల్లీకి చేరుకున్నారు.
మోదీ కేబినెట్‌లో యువతకు గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ప్రాతినిధ్యం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఓబీసీలకు కూడా పెద్దపీట వేస్తారని చెబుతున్నారు.