సుంకాల వివాదం మధ్య ప్రధాని కీలక నిర్ణయం.. మోదీ అమెరికా పర్యటన రద్దు..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సమావేశానికి హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సెప్టెంబర్ 27న భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ప్రసంగిస్తారు. గతంలో మోదీ పేరు ప్రారంభ జాబితాలో చేర్చారు. కానీ తరువాత దానిని మార్చారు. UNGA కార్యక్రమంలో ఈ మార్పు సర్వసాధారణం. చివరి నిమిషంలో మార్పులు తరచుగా కనిపిస్తాయి.

సుంకాల వివాదం మధ్య ప్రధాని కీలక నిర్ణయం.. మోదీ అమెరికా పర్యటన రద్దు..!
Pm Modi In Unga

Updated on: Sep 06, 2025 | 10:26 AM

సెప్టెంబర్ నెల చివర్లో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి (UNGA) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ UNGAలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య సుంకాల విషయంలో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో UNGAకు హాజరు కాకూడదని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు.

ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వక్తల జాబితాలో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి పేర్లు కూడా ఉన్నాయి. UNGA 80వ సెషన్‌లో ఉన్నత స్థాయి సాధారణ చర్చ సెప్టెంబర్ 23 నుండి 29 వరకు జరుగుతుంది. ఇందులో సాంప్రదాయకంగా బ్రెజిల్ సెషన్‌ను ప్రారంభిస్తుంది. తరువాత అమెరికా ఉంటుంది. ఈ సెషన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ పేరు కూడా చేర్చడం జరిగింది.

వక్తల జాబితా ప్రకారం, సెప్టెంబర్ 27 ఉదయం భారతదేశం జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తుంది. ఈ సెషన్‌లో, ప్రధానమంత్రి స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సంవత్సరంలో అత్యంత రద్దీగా ఉండే దౌత్య సమావేశంగా పరిగణించబడే ఈ ఉన్నత స్థాయి సమావేశం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం సెషన్ ఇజ్రాయెల్-హమాస్ వివాదంతో పాటు ఉక్రెయిన్-రష్యా వివాదంపై దృష్టి సారిస్తుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైట్ హౌస్‌లో డోనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం కోసం అమెరికాను సందర్శించారు. ఈ సమావేశం తర్వాత మోదీ-ట్రంప్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) మొదటి భాగంపై చర్చలు జరపాలని యోచిస్తున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయితే, ట్రంప్ ఆగస్టు నెలలో రష్యా చమురు కొనుగోలుపై భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించారు. దీంతో మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది.

ట్రంప్ చర్యను తప్పుడు అనాలోచిత నిర్ణయం అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థ మాదిరిగానే, భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..