PM Narendra Modi: ఈనెల 14న ప్రధాన నరేంద్ర మోదీ చెన్నై పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనను మోదీ కేవలం మూడు గంటల్లోనే ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అయితే ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించేలా ముందుగా పీఎంఓ అధికారులు ఏర్పాట్లు చేపట్టినప్పటికీ, సీఎం ఎడప్పాడి పళనిస్వామి పట్టుబట్టి ప్రధాని చెన్నైకి వచ్చేలా పర్యటనను ఖరారు చేయించారు.
వింకోనగర్- వాషర్‌మెన్‌పేట మధ్య పూర్తయిన మెట్రో రైలు తొలివిడత విస్తరణ పనులను, చెన్నై బీచ్-అత్తిపట్టు నాలుగులైన్ల రహదారి పథకాన్ని విల్లుపురం-తిరువారూర్ రైలు మార్గం విద్యుద్దీకరణ పనులను మోదీ ప్రారంభించనున్నారు. అదే విధంగా ఆవడిలోని రక్షణ ఆయుధాల కర్మాగారంలో తయారు చేసిన ఎంపీటీ అర్జున ఎంకే 1(ఏ) ఫిరంగులను రక్షణశాఖకు లాంఛనంగా అప్పగిస్తారు. అలాగే కల్లనై కాలువ పునరుద్దరణ పనులకు, చెన్నై ఐఐటీ ప్రాంగణంలో నిర్మించతలపెట్టిన డిస్కవరీ విభాగానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ముఖ్యమంత్రి పళనీస్వామి, డిప్యూటీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సమావేశం కానున్నారు.