Niti Aayog Meeting: నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారభించడంపై కాంగ్రెస్ సహా.. పలు ప్రధాన పార్టీలు విమర్శలు వ్యక్తంచేస్తున్నాయి. దీంతోపాటు పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు 21 పార్టీలు వెల్లడించాయి. ఈ క్రమంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ సహా.. విపక్ష పార్టీలు వెల్లడించాయి. సమావేశంలో 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు పాల్గొంటారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన మరికాసేపట్లో జరిగే నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి బీజేపీయేతర ప్రతిపక్షాల సీఎంలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, ఒడిసా సీఎంలు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, నవీన్ పట్నాయక్ మాత్రమే హాజరవుతున్నారు.
ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరవుతారనుకున్న చివరిలో వారు నిర్ణయాన్ని మార్చుకున్నారు. వీరి నిర్ణయం తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంతో పాటు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. మోదీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలే కాకుండా.. యూపీఏ భాగస్వామ్య పార్టీల సీఎంలు కూడా నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..