Arun Jaitley Memorial Lecture: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరుణ్ జైట్లీ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు జరిగే తొలి ‘అరుణ్ జైట్లీ స్మారక ఉపన్యాసం’ (AJML)లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ (PM Modi) అరుణ్ జైట్లీకి నివాళులర్పించి ప్రసంగించనున్నారు. మొదటి అరుణ్ జైట్లీ మెమోరియల్ లెక్చర్‌లో సింగపూర్ ప్రభుత్వ సీనియర్ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం ‘అభివృద్ధి ద్వారా వృద్ధి, సమగ్రత ద్వారా వృద్ధి’ (Growth through Inclusivity, Inclusivity through Growth) అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. ఉపన్యాసం తర్వాత మథియాస్ కోర్మాన్ (OECD సెక్రటరీ జనరల్), అరవింద్ పనగారియా (ప్రొఫెసర్, కొలంబియా విశ్వవిద్యాలయం) ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం జరగనుంది.
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ దేశానికి చేసిన కృషికి గుర్తింపుగా ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదటి ‘అరుణ్ జైట్లీ స్మారక ఉపన్యాసం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకటన విడుదల చేసింది.
కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్‌లో ఆర్ధిక వేత్తలతో ప్రధాని భేటీ..
ఈ రోజు నుంచి10 వరకు మూడు రోజుల పాటు జరగనున్న కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ (KEC) లో పాల్గొనే ప్రతినిధులతో కూడా ప్రధాన మంత్రి మోడీ సంభాషించనున్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు అన్నే క్రూగర్ (జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం), నికోలస్ స్టెర్న్ (లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్) రాబర్ట్ లారెన్స్ (హార్వర్డ్ కెన్నెడీ స్కూల్), జాన్ లిప్స్కీ (మాజీ యాక్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్, IMF), జునైద్ అహ్మద్ (వరల్డ్ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ ఫర్ ఇండియా) ప్రధానమంత్రిని కలిసి సంభాషించనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మద్దతుతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ KEC సదస్సును నిర్వహిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..