PM Modi Aerial Survey: వాయుగుండంగా మారిన తౌక్టే తుఫాన్.. గుజరాత్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే

గుజ‌రాత్‌ రాష్ట్రంలో తౌక్టే భారీ న‌ష్టాన్ని మిగిల్చింది. అతి భీక‌రంగా విరుచుకుప‌డ్డ తుఫాన్‌తో భారీ ఆస్థి న‌ష్టం సంభ‌వించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజ‌రాత్‌లో ఏరియ‌ల్ స‌ర్వే నిర్వహించారు.

PM Modi Aerial Survey: వాయుగుండంగా మారిన తౌక్టే తుఫాన్.. గుజరాత్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
Pm Modi Aerial Survey

Updated on: May 19, 2021 | 3:16 PM

PM Modi Aerial Survey: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను బీభ‌త్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో కేరళ, కర్నాటక, గోవా, గుజరాత్​లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలను గడగడలాడించిన అతి భీకర తౌక్టే తుఫాన్ క్రమంగా బలహీనపడి ప్రస్తుతం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తొలుత అతిభీకర తుపానుగా రూపాంతరం చెందిన తౌక్టే తుఫాన్ సోమవారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు గుజరాత్​లోని దీవ్, ఉనాల మధ్య తీరం దాటిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సమయంలో గుజరాత్ చిగురుటాకులా వణికిపోయింది. తుఫాన్ వలన కురిసిన వర్షాలు, గాలుల ప్రభావంతో వివిధ ఘటనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదే క్రమంలో గుజ‌రాత్‌ రాష్ట్రంలో తౌక్టే భారీ న‌ష్టాన్ని మిగిల్చింది. అతి భీక‌రంగా విరుచుకుప‌డ్డ తుఫాన్‌తో భారీ ఆస్థి న‌ష్టం సంభ‌వించిన‌ట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజ‌రాత్‌లో ఏరియ‌ల్ స‌ర్వే నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల‌ను ఆయ‌న విహంగ వీక్షణం చేశారు. తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ప్రాంతాలను ప‌రిశీలించారు. ఉనా, డ‌యూ, జ‌ఫ‌రాబాద్‌, మ‌హువా ప్రాంతాల్లో ఆయ‌న స‌ర్వే నిర్వహించారు. తుఫాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో జ‌రిగిన న‌ష్టాన్ని అధికారులు పూర్తిస్థాయిలో అంచనా వేయాల్సివుంది. గుజరాత్ పర్యటనలో ప్రధాని మ్యాప్‌ల‌ను, శాటిలైట్ ఇమేజ్‌ల‌ను ప‌రిశీలించారు. గుజ‌రాత్‌లోని కోస్టల్ జిల్లాల‌ను ఆయ‌న స‌ర్వేలో ప‌రిశీలించారు. ఎంత న‌ష్టప‌రిహారం ఇవ్వాల‌న్న దానిపై త్వర‌లో ప్రక‌ట‌న చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లో మ‌రికాసేప‌ట్లో ప్రధాని మోదీ అధికారులతో తుఫాను నష్టంపై స‌మీక్ష స‌మావేశం నిర్వహించ‌నున్నారు.


Read Also…. ఆ గ్రామాన్ని వణికిస్తున్న మాయరోగం, 27 రోజుల వ్యవధిలో 36 మంది మృతి.. కరోనా కాదట..!