
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచం మొత్తం ఈ కొత్త భారతదేశ రూపాన్ని చూసిందని అన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత తొలిసారి బెంగళూరు చేరుకున్న ప్రధాని మోదీ, మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభించారు. అలాగే మూడవ దశకు శంకుస్థాపన చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజయం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, భారత్ శక్తి, ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవపై ఆధారపడి ఉందని, ఇందులో బెంగళూరు, కర్ణాటక యువత ముఖ్యమైన పాత్ర పోషించారని ప్రధాని మోదీ అన్నారు.
“ఆపరేషన్ సింధూర్” విజయానికి ప్రధాన కారణం మన సాంకేతికత, రక్షణ పరంగా మేక్ ఇన్ ఇండియా శక్తి అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. కర్ణాటక యువత దీనికి ఎంతో దోహదపడ్డారన్నారు. ముఖ్యంగా బెంగళూరులోని ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత దళాల విజయాన్ని, సరిహద్దు వెంబడి అనేక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశామన్నారు. మన సామర్థ్యాన్ని, ఉగ్రవాదులను రక్షించడానికి వచ్చిన పాకిస్తాన్‌ను కొన్ని గంటల్లోనే మోకరిల్లేలా చేయగల మన సామర్థ్యాన్ని ప్రపంచం చూసిందని ఆయన అన్నారు. నవ భారత ఆవిర్భావానికి చిహ్నంగా మారుతున్న బెంగళూరు నగరం ఎదుగుతున్నట్లు ప్రధాని తెలిపారు. తత్వశాస్త్రం ఆత్మలో, సాంకేతిక పరిజ్ఞానం కార్యాచరణలో ఉన్న నగరం. ప్రపంచ ఐటీ పటంలో భారతదేశ జెండాను ఎగురవేసిన నగరం అని అన్నారు.
బెంగళూరు విజయ గాథకు పౌరుల కృషి, ప్రతిభే కారణమని ఆయన ప్రశంసించారు. 21వ శతాబ్దంలో పట్టణ ప్రణాళిక, పట్టణ మౌలిక సదుపాయాలు మన నగరాలకు అవసరమని ప్రధానమంత్రి అన్నారు. భవిష్యత్తు కోసం బెంగళూరు వంటి నగరాలను మనం సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో భారత ప్రభుత్వం నగరంలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించింది. ఇందులో భాగంగా మెట్రో ఎల్లో లైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే మెట్రో మూడవ దశకు పునాది రాయి వేశారు.
భారతదేశ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ప్రస్తావిస్తూ, గత 11 సంవత్సరాలలో మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుండి టాప్-5 స్థానానికి చేరుకుందని ప్రధానమంత్రి అన్నారు. టాప్-3 ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా మనం చాలా వేగంగా ముందుకు సాగుతున్నామన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం, నవ భారతదేశం అనే ఈ ప్రయాణం డిజిటల్ ఇండియాతో దశలవారీగా పూర్తవుతుందన్నారు. ఇండియా AI మిషన్ వంటి పథకాలతో భారతదేశం ప్రపంచ AI నాయకత్వం వైపు పయనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘సెమీకండక్టర్ మిషన్’ కూడా ఇప్పుడు వేగం పుంజుకుంటుందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశానికి త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్స్ లభిస్తాయని అన్నారు. ‘తక్కువ ఖర్చు, అధిక సాంకేతికత’ అంతరిక్ష మిషన్‌కు భారతదేశం ప్రపంచ ఉదాహరణగా మారిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
మౌలిక సదుపాయాల రంగంలో జరుగుతున్న పురోగతిని ప్రస్తావిస్తూ, భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ కలిగిన దేశంగా అవతరించిందని ప్రధాని మోదీ అన్నారు. రైల్వే విద్యుదీకరణలో కూడా గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన అన్నారు. 2014 కి ముందు, దాదాపు 20,000 కి.మీ రైల్వే మార్గాలు విద్యుదీకరించడం జరిగిందని ఆయన అన్నారు. గత 11 సంవత్సరాలలో, ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని, ఇప్పుడు 40,000 కి.మీ రైల్వే మార్గాలు విద్యుదీకరించడం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు.
భూమి, సముద్రం, వాయు రంగాలన్నింటిలోనూ అభివృద్ధి విస్తరించిందని ప్రధాని మోదీ అన్నారు. 2014లో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే పనిచేసేవని, ఇప్పుడు ఈ సంఖ్య 160కి పెరిగిందన్నారు. అదేవిధంగా జాతీయ జలమార్గాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని గుర్తు చేశారు. 2014లో కేవలం మూడు మాత్రమే ఉండగా నేడు వాటి సంఖ్య 30కి పెరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుత విజయాల మధ్య, మన తదుపరి పెద్ద ప్రాధాన్యత ఇప్పుడు టెక్ ఆత్మనిర్భర్ భారత్ అని ప్రధాని మోదీ అన్నారు.
భారత టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచం మొత్తానికి సాఫ్ట్‌వేర్, ఉత్పత్తులను సృష్టించామని ఆయన అన్నారు. భారతదేశ అవసరాలకు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి మనమందరం ఇక్కడ ఉన్నామని, దేశప్రజల శ్రేయస్సు కోసం కలిసి చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు.
వీడియో చూడండి..
#WATCH | Karnataka | Prime Minister Narendra Modi says, "The success of Operation Sindoor is due to our technology and the power of 'Make in India' in defence. The youth of Bengaluru and Karnataka have contributed a lot to this…"
(Source: ANI/DD) pic.twitter.com/NHkZnCZdGr
— ANI (@ANI) August 10, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..