వదంతులకు దూరంగా ఉండండి.. ఏ కష్టమొచ్చిన కలిసికట్టుగా ఎదురుకుందాంః ప్రధాని మోదీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (మార్చి 29, 2026) ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 'మన్ కీ బాత్' కార్యక్రమం యొ132వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, "ఈ మార్చి నెల ప్రపంచవ్యాప్తంగా చాలా అల్లకల్లోలంగా గడిచింది. కోవిడ్ కారణంగా యావత్ ప్రపంచం చాలా కాలం పాటు అనేక సమస్యలను ఎదుర్కొన్న విషయం మనందరికీ గుర్తుంది. కరోనా సంక్షోభాన్ని అధిగమించిన తర్వాత ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు.

వదంతులకు దూరంగా ఉండండి.. ఏ కష్టమొచ్చిన కలిసికట్టుగా ఎదురుకుందాంః ప్రధాని మోదీ!
Pm Modi In Mann Ki Baat

Updated on: Mar 29, 2026 | 12:48 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (మార్చి 29, 2026) ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 132వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, “ఈ మార్చి నెల ప్రపంచవ్యాప్తంగా చాలా అల్లకల్లోలంగా గడిచింది. కోవిడ్ కారణంగా యావత్ ప్రపంచం చాలా కాలం పాటు అనేక సమస్యలను ఎదుర్కొన్న విషయం మనందరికీ గుర్తుంది. కరోనా సంక్షోభాన్ని అధిగమించిన తర్వాత ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని అందరూ ఆశించారు. అయితే, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో యుద్ధ, ఘర్షణ పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ సంక్షోభం నుండి మరోసారి ఐక్యంగా బయటపడాల్సి ఉంది” అని ప్రధానమంత్రి అన్నారు.

ప్రస్తుతం యుద్ధంలో ఉన్న ప్రాంతం మన ఇంధన అవసరాలకు ఒక ప్రధాన కేంద్రమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది పెట్రోల్, డీజిల్ విషయంలో ప్రపంచ సంక్షోభానికి దారితీస్తోందన్నారు. మన దౌత్య సంబంధాలు, వివిధ దేశాల నుండి మనకు లభించే మద్దతు, గత దశాబ్ద కాలంలో మనం నిర్మించుకున్న బలాలు ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు భారతదేశానికి దోహదపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం నిస్సందేహంగా సవాలుతో కూడిన సమయాలని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు, ‘మన్ కీ బాత్’ ద్వారా, ఈ సవాలును అధిగమించడానికి పౌరులందరూ ఏకం కావాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్న వారు మానుకోవాలని ఆయన సూచించారు. ఇది 140 కోట్ల మంది పౌరుల ప్రయోజనాలకు సంబంధించిన విషయమని, ఇందులో స్వార్థ రాజకీయాలకు తావులేదని ఆయన ఉద్ఘాటించారు. అందువల్ల, పుకార్లు వ్యాపింపజేస్తున్న వారు దేశానికి పెద్ద హాని కలిగిస్తున్నారు. ఈ సమయంలో దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వదంతులకు మోసపోవద్దని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సమాచారాన్ని విశ్వసించి, దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. 140 కోట్ల మంది పౌరుల బలంతో గత సంక్షోభాలను ఎలాగైతే అధిగమించామో, అలాగే ఈసారి కూడా మనమందరం కలిసి ఈ క్లిష్ట పరిస్థితి నుండి విజయం సాధిస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

మార్చి నెల దేశవ్యాప్తంగా క్రీడాభిమానులకు ఉత్సాహం, ఆనందంతో నిండిపోయిందని ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో అన్నారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించినప్పుడు, దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. భారత జట్టు సాధించిన ఈ అద్భుతమైన విజయానికి మనమందరం చాలా గర్వపడుతున్నాము. గత నెల చివరిలో కర్ణాటకలోని హుబ్లీలో ఒక అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ గెలిచి జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జట్టు తన తొలి రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోవడం హర్షదాయకం. కఠోర శ్రమ ఫలిస్తుందని ఇది నిరూపిస్తుందన్నారు ప్రధాని. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతిభావంతుడైన అథ్లెట్ గుల్వీర్ సింగ్, కొన్ని వారాల క్రితం న్యూయార్క్ సిటీ హాఫ్ మారథాన్‌లో మూడో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గంటలోపు హాఫ్ మారథాన్‌ను పూర్తి చేసిన తొలి భారతీయ అథ్లెట్‌గా అతను నిలిచాడని గుర్తు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మత్స్యకారుల గురించి ప్రస్తావించారు. కష్టపడి పనిచేసే మత్స్యకారుల జీవితాలను అనేక విధాలుగా సులభతరం చేస్తున్నామని ఆయన అన్నారు. ఓడరేవుల అభివృద్ధి, మత్స్యకారులకు బీమా వంటి అనేక కార్యక్రమాలు వారికి ఎంతగానో సహాయపడుతున్నాయని తెలిపారు. నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రతి గ్రామంలోనూ సామూహిక స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని చెప్పారు. పాత చెరువులను శుభ్రం చేయడంతో పాటు, వర్షపు నీటిని సంరక్షించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమృత్ సరోవర్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా దాదాపు 70,000 అమృత్ సరోవర్లను నిర్మించారని ప్రధాని మోదీ తెలిపారు.

ఫిట్‌నెస్, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ దేశపౌరులను కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజుల కన్నా తక్కువ సమయం ఉందని, యోగా పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి క్రమంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఆఫ్రికాలోని జిబూటీలో అల్మిస్ జీ తన అరవింద్ యోగా కేంద్రం ద్వారా యోగాను ప్రోత్సహిస్తున్నారని కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. అనేక ఇతర ప్రదేశాలలో యోగా బోధిస్తూ, ఆరోగ్య అవగాహనను కూడా కల్పిస్తున్నారు. పౌరులు చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలని, వంట నూనె వాడకాన్ని 10 శాతం మేర తగ్గించుకోవాలని ప్రధానమంత్రి కోరారు. మన ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు ఈ చిన్న చర్యలు చాలా కీలకమని ఆయన అన్నారు.

దేశ యువత శక్తిని దేశ నిర్మాణానికి మళ్లించినప్పుడు, అది దేశానికి అపారమైన మద్దతును అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ విషయంలో, ‘మై భారత్’ సంస్థ యువతరాన్ని సానుకూల కార్యకలాపాలలో నిమగ్నం చేయడం ద్వారా దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. ‘మై భారత్’ నిర్వహించిన ‘బడ్జెట్ క్వెస్ట్’ను ఉదాహరణగా చూపుతూ, బడ్జెట్ ప్రక్రియ, విధాన రూపకల్పనతో యువతను అనుసంధానించడమే దీని లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్విజ్‌లో దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది యువత పాల్గొన్నారు. దీని తర్వాత, వ్యాస పోటీకి సుమారు 1,60,000 మందిని ఎంపిక చేశారు. ఈ వ్యాసాలలో కొన్నింటిని చదివిన తన అనుభవాన్ని కూడా ప్రధాని మోదీ పంచుకున్నారు.

“జ్ఞాన్ భారతం సర్వే మన గొప్ప సంస్కృతి, సుసంపన్నమైన వారసత్వానికి సంబంధించినది. దేశవ్యాప్తంగా ఉన్న తాళపత్ర గ్రంథాల గురించి సమాచారాన్ని సేకరించడమే దీని ఉద్దేశ్యం. ఈ సర్వేలో చేరడానికి జ్ఞాన్ భారతం యాప్ ఒక మార్గం. మీ వద్ద ఏవైనా తాళపత్ర గ్రంథాలు లేదా వాటికి సంబంధించిన సమాచారం ఉంటే, దయచేసి వాటి ఫోటోను జ్ఞాన్ భారతం యాప్‌లో పంచుకోండి. ప్రతి వివరాలను నమోదు చేసే ముందు, దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ధృవీకరిస్తున్నాము. ఇప్పటివరకు ప్రజలు వేలాది తాళపత్ర గ్రంథాలను పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది.” అని ప్రధాని మోదీ అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని నమ్సాయికి చెందిన చావో నంతిసింగ్ లోకాంగ్ తాయ్ లిపిలోని వ్రాతప్రతులను పంచుకున్నారు. అమృత్‌సర్‌కు చెందిన అమిత్ సింగ్ రాణా, మన గొప్ప సిక్కు సంప్రదాయం, పంజాబీ భాషతో సన్నిహిత సంబంధం ఉన్న గురుముఖి లిపిలోని వ్రాతప్రతులను పంచుకున్నారు. కొన్ని సంస్థలు తాళపత్ర గ్రంథాలను విరాళంగా ఇచ్చాయి. రాజస్థాన్‌లోని అభయ్ జైన్ గ్రంథాలయం చాలా పురాతనమైన రాగి ఫలకాల వ్రాతప్రతులను పంచుకుంది. అదే సమయంలో, లడఖ్‌లోని హమీస్ మఠం విలువైన టిబెటన్ వ్రాతప్రతుల గురించి సమాచారాన్ని అందించింది. నేను కేవలం కొన్ని ఉదాహరణలను మాత్రమే అందించాను. ఈ సర్వే జూన్ మధ్య వరకు కొనసాగుతుంది. మీరందరూ మీ సంస్కృతిలోని అంశాలను వెలికితీసి, పంచుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us