Mizoram Assembly Elections: అభివృద్ధి సకల సౌకర్యాలతో ‘అద్భుతమైన మిజోరం’ను తీర్చిదిద్దేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీనిచ్చారు. మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రం మిజోరం ప్రజలను ఉద్దేశించి మోడీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మిజోరాం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఎన్నికల బరిలో ఉన్న రాష్ట్ర ప్రజలు తన కుటుంబ సభ్యులలాంటి వారని పేర్కొన్నారు. రైల్వే నెట్‌వర్క్‌లు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, క్రీడల అభివృద్ధి, ఇతర రంగాలతో సహా మిజోరాం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. మిజోరాం గొప్ప ప్రకృతి సౌందర్యం, శక్తివంతమైన సంస్కృతిని ఉటంకిస్తూ ప్రపంచ పర్యాటక కేంద్రంగా అవతరించే సామర్థ్యాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. వీడియో సందేశంలో ప్రధాని మోదీ మిజోరంలో మెరుగైన రవాణా ద్వారా పరివర్తనను ప్రోత్సహిస్తానని గతంలో ఇచ్చిన హామీని ప్రస్తావించారు. దానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నేతృత్వంలో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించామని.. అభివృద్ధి.. శ్రేయస్సు పట్ల బిజెపి నిబద్ధతతో ముందుకు వెళ్తోందని.. మరోసారి ఆదరించాలంటూ కోరారు. ప్రజల ఆకాంక్షలు, కలలు, అవసరాలను నెరవేర్చడానికి తాము అత్యధిక ప్రాముఖ్యతను ఇచ్చినట్లు తెలిపారు.
మిజోరాం ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకుంటామని, తద్వారా ప్రజలు చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి మిజోరాం రైతులే పునాది అని, కేంద్ర పథకం కింద 1.7 లక్షల మంది రైతులు తమ ఖాతాల్లోకి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పారు. భారతదేశం క్రీడల్లో ఎదుగుదలలో ఈశాన్య రాష్ట్రాలు కీలకపాత్ర పోషించాయని, మిజోరంతో సహా ఈ ప్రాంతంలో క్రీడా మౌలిక సదుపాయాలను పెంచేందుకు బీజేపీ కట్టుబడి ఉందంటూ మోదీ భరోసానిచ్చారు.
Together, we will fulfil the dream of a marvellous Mizoram!
My message to the wonderful people of Mizoram.https://t.co/Poodx5b4Kd
— Narendra Modi (@narendramodi) November 5, 2023
మిజోరాంలో నేటితో ప్రచార పర్వం ముగియనుంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..