PM Modi Interacts with IPS probationers: యువ నాయకత్వం దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. యువత తలచుకుంటే దెన్నైనా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తిచేసుకున్న ఐపీఎస్ అధికారులతో (ఐపీఎస్ ప్రొబేషనర్లు) వర్చువల్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ఐపీఎస్ అధికారులతో ప్రత్యేకంగా సంభాషించారు. ఐపీఎస్ అధికారులు అడిగిన ప్రశ్నలకు మోదీ పలు సలహాలు సూచనలిచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అధికారులంతా.. నేషన్ ఫస్ట్ పాలసీని అవలంబించాలని కోరారు. ఎలాంటి నిర్ణయం తిసుకున్నా ఖచ్చితంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. సేవ చేస్తూ దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఎంచుకోవడం గర్వనీయమని మోడీ పేర్కొన్నారు. పోలీసు శాఖలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని.. ఇది దేశానికి మంచి పరిణామమని మోడీ తెలిపారు. దీంతో పోలీసింగ్ వ్యవస్థ పటిష్టంగా మారుతుందన్నారు. మహిళా అధికారులను చూసి దేశం మొత్తం గర్వపడుతుందన్నారు.
శిక్షణ పూర్తిచేసుకున్న అధికారులంతా త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో పోలీసు అధికారులు అవుతారని ప్రధాని మోడీ అన్నారు. సహృదయంతో దేశానికి సేవ చేయాలని సూచించారు. ప్రభుత్వం నక్సలిజానికి స్వస్తి పలికిందని.. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కొనసాగుతుందని మోడీ అన్నారు. దీనిని యువ నాయకత్వం ముందుకు తీసుకెళుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెద్ద సమస్యగా మారాయని మోడీ అన్నారు. సైబర్ నేరగాళ్లు మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారని.. అన్ని ప్రాంతాలకు డిజిటల్ అవగాహనను విస్తరించాలని మోడీ పేర్కొన్నారు. కొత్త పోలీసు అధికారులు ఎలాంటి విషయాల్లోనైనా.. ఏదైనా సూచనలు చేయాలనుకుంటే.. తనకు, మంత్రిత్వ శాఖకు లేఖలు పంపాలని సూచించారు. పోలీసు అధికారులు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యమని మోడీ ఈ సందర్భంగా సూచించారు.
Also Read: