PM Narendra Modi: జపాన్ చేరుకున్న ప్రధాని మోడీ.. ‘భారత్ మాతా కా షేర్’ అంటూ ఘన స్వాగతం.. వీడియో

|

May 23, 2022 | 8:28 AM

జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ 40 గంటల్లో 23 సమావేశాల్లో పాల్గొననున్నారు. క్వాడ్ సమ్మిట్‌తోపాటు జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు.

PM Narendra Modi: జపాన్ చేరుకున్న ప్రధాని మోడీ.. ‘భారత్ మాతా కా షేర్’ అంటూ ఘన స్వాగతం.. వీడియో
Pm Modi
Follow us on

PM Modi – Quad summit 2022: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ రాజధాని టోక్యో చేరుకున్నారు. టోక్యోలోని హోటల్ న్యూ ఒటానీలో ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన సందర్భంగా ఈ హోటల్‌లో బస చేయనున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ఆయన జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఇక్కడ జరిగే క్వాడ్ సమ్మి (quad summit) ట్‌లో పలు దేశాల అధినేతలతో ఆయన చర్చలు జరపనున్నారు. మొత్తంగా జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ 40 గంటల్లో 23 సమావేశాల్లో పాల్గొననున్నారు. జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో కూడా ఆయన భేటీ అవుతారు. ఈ పర్యటనలో ఇండియా – జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా నిర్ణయాలు తీసుకోనున్నారు.

కాగా.. టోక్యో చేరుకున్న ప్రధాని మోదీకి ఇక్కడి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన భారతీయులు ‘హర్ హర్ మోదీ’, ‘మోదీ మోదీ’, ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కా షేర్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. ప్రధానిని చూసి భారత సంతతి ప్రజలు హర్షధ్వానాలు చేస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ సమయంలో ఒక భారతీయుడు పోస్టర్‌ను పట్టుకుని కనిపించాడు. అందులో ‘370 తొలగించిన వారు టోక్యోకు వచ్చారు’ అంటూ దానిపై రాసి ఉంది. కాగా.. ప్రధానికి స్వాగతం పలికేందుకు వచ్చిన భారతీయులను ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించి అందర్ని ఆశ్చర్యపరిచారు.

ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఎన్‌ఇసి కార్పొరేషన్ ప్రెసిడెంట్ నోబుహిరో ఆండో, యునిక్లో ప్రెసిడెంట్ తదాషి యానై, సుజుకీ మోటార్ కార్పొరేషన్ అడ్వైజర్ ఒసాము సుజుకీ, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ మసయోషి సన్‌తో సహా పలువురు ప్రముఖ కార్పొరేట్ నాయకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించనున్నారు. మే 24న టోక్యోలో జరిగే క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ హాజరుకానున్నారు. సమ్మిట్ సందర్భంగా బైడెన్, కిషిడా, అల్బనీస్‌లతో ప్రధాని మోదీ వేర్వేరు ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..