PM Narendra Modi on Strengthen Health Infrastructure: యావత్ ప్రపంచ కరోనాతో తల్లడిల్లుతున్న సమయంలో భారత వైద్యులు శక్తివంచన లేకుండ కష్టపడ్డారని భారత ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడియల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. గడిచిన ఏడాదిన్నర కాలంగా వైద్యుల సేవలను గుర్తు చేసుకున్నారు. కరోనా మహమ్మారి విజృభిస్తున్న సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఎంతోమంది ప్రాణాలను కాపాడారని ప్రధాని వ్యాఖ్యానించారు. డాక్టర్లందరికీ దేశంలోని 130 కోట్ల ప్రజల తరపున కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ప్రముఖ వైద్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బిదన్ చంద్ర రాయ్ జయంతి, వర్ధంతి అయిన జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది.
దేశంలో వైద్యరంగానికి సంబంధించిన మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు రెండు లక్షల కోట్లు ఖర్చు చేశామని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మరో రూ.50 వేల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. వైద్యరంగంలో ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. వైద్యులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన.. గత సంవత్సరం వైద్యులపై దాడులకు వ్యతిరేకంగా అనేక నిబంధనలను తీసుకువచ్చామన్నారు. అలాగే కరోనా యోధులకు ఉచిత బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తున్నామన్నారు.
మరోవైపు, కరోనా ఏ రూపంలో వచ్చిన ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ప్రధాని.. చిన్నారులకు చికిత్స అందించేందుకు నిధులు సిద్ధంగా ఉంచామని అన్నారు. దేశ ప్రజలకు వ్యాక్సినేషన్ అందించే విషయంలో ఆరోగ్య కార్యాకర్తల సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని అత్యధిక జనాభాకు వ్యాక్సిన్ అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
అహర్నిశలు శ్రమించి.. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన డాక్టర్లు దేవుళ్లతో సమానమని ప్రధాని మోదీ అన్నారు. ఎంతోమంది ప్రజల జీవితాలను వాళ్లు మార్చేశారని గుర్తు చేశారు. కరోనా సమయంలో అనేక మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్లలో పలువురు ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. వైరస్ తన స్వరూపాన్ని మార్చుకుంటున్నప్పటికీ… వాటి నుంచి కాపాడేందుకు డాక్టర్లు ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. మన దేశంలో కరోనా సోకిన వారి శాతంతో పాటు మరణాల శాతం చూసుకుంటే అనేక దేశాల కంటే మనం ఎంతో మెరుగైన దశలో ఉన్నామని అన్నారు.
Our doctors, their knowledge and experience is helping us battle this COVID19 virus. Budget allocation for the health sector has been doubled: PM Modi’s address on #DoctorsDay2021 pic.twitter.com/9AiYvdkcbT
— ANI (@ANI) July 1, 2021