ప్రధాని మోదీ సెరవిక్ గ్లోబల్ ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ లీడర్ షిప్ అవార్డును అందుకోనున్నారు. వచ్ఛేవారం హూస్టన్లో జరగనున్న వార్షిక అంతర్జాతీయ మహాసభలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు దీని నిర్వాహక సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రకటించింది. మార్చి 1 నుంచి 5 వరకు వర్చ్యువల్ గా జరగనున్న కాన్ఫరెన్స్ లో ఆయనకు అవార్డు ప్రదాన ప్రకటన చేయనున్నట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ వైస్ చైర్మన్, కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డేనియల్ ఎర్జిన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐరాసలో వాతావరణ సంబంధ విభాగం ప్రత్యేక దౌత్య ప్రతినిధి జాన్ కెర్రీ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ అధ్యక్షుడు, బ్రేక్ త్రూ ఎనర్జీ బిల్ గేట్స్ వ్యవస్థాపకుడు శౌదీ ఆరమ్ కో అమిన్ నాసర్ తదితరులు కూడా పాల్గొననున్నారు.
ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చడంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాకు నేతృత్వం వహిస్తున్న ప్రధాని మోదీకి ఈ సెరావిక్ గ్లోబల్ ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ లీడర్ షిప్ అవార్డును ఇవ్వడం ఎంతయినా సముచితమని డేనియల్ ఎర్జిన్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఇంధన అవసరాలకు సంబంధించి భవిష్యత్ వ్యూహం వంటివాటితో భారత దేశం గ్లోబల్ ఎనర్జీ, ఎన్విరాన మెంటల్ శక్తిగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో ఇంధన, పారిశ్రామిక అధిపతులు, అధినేతలు,నిపుణులు, ప్రభుత్వ అధికారులు, ఫైనాన్సియల్ నేతలు, ఇతర రంగాలలోని ప్రముఖులు పాల్గొననున్నారు.
ఇది ఈ సంస్థ నిర్వహిస్తున్న 39 వ మహాసభ. డేనియల్ ఎర్జిన్ తో ప్రధాని మోదీ ప్రత్యేక ప్లీనరీలో కూడా పాల్గొననున్నారు. ఇంధనం, పర్యావరణ రంగాలలో మోదీ చేసిన, చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.టెక్నాలజీ, ఎనర్జీ, పాలసీ, ఫైనాన్షియల్ వంటి వివిధ రంగాల్లో జరుగుతున్న కృషిని హైలైట్ చేస్తూ ప్రతి ఏడాదీ ఈ కాన్ఫరెన్స్ ను హూస్టన్ లో నిర్వహిస్తున్నారు. 2019 లో 85 దేశాల నుంచి వెయ్యికి పైగా సంస్థలకు చెందిన 5,500 మంది డెలిగేట్లు ఈ సభల్లో పాల్గొన్నారు. సెరావీక్ సభల్లో ప్రసంగించినవారిలో బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బిల్ గేట్స్ వంటి ప్రముఖులు ఉన్నారు.
Read More :