Purvanchal Expressway: వాయుసేన విమానంలో రోడ్డుపై దిగనున్న ప్రధాన మంత్రి మోడీ.. ఎందుకంటే..

|

Nov 16, 2021 | 8:26 AM

ఉత్తరప్రదేశ్‌ తూర్పు ప్రాంతంలోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించనున్నారు. అయితే రిబ్బన్ కటింగ్ చేసో లేక ఆ రోడ్డుపై ప్రయాణించో కాకుండా విమానంలో రోడ్డపై దిగనున్నారు...

Purvanchal Expressway: వాయుసేన విమానంలో రోడ్డుపై దిగనున్న ప్రధాన మంత్రి మోడీ.. ఎందుకంటే..
Modi
Follow us on

ఉత్తరప్రదేశ్‌ తూర్పు ప్రాంతంలోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించనున్నారు. అయితే రిబ్బన్ కటింగ్ చేసో లేక ఆ రోడ్డుపై ప్రయాణించో కాకుండా విమానంలో రోడ్డపై దిగనున్నారు. భారత వాయుసేనకు చెందిన సి-130జె సూపర్‌ హెర్క్యులస్‌ విమానంలో ఈ రహదారిపై దిగి, దానిని ప్రారంభిస్తారు. యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘ఉత్తరప్రదేశ్‌ అభివృద్ధి పథంలో ఇది ప్రత్యేక రోజు’ అని ప్రధాని మోడీ సోమవారం ట్వీట్‌ చేశారు. “ఈ ప్రాజెక్ట్ యూపీ యొక్క ఆర్థిక, సామాజిక పురోగతికి బహుళ ప్రయోజనాలను తీసుకొస్తుందని” అని ప్రధాన మంత్రి ట్వి్ట్టర్‌లో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే యొక్క నాలుగు ఫోటోలతో పాటు పోస్ట్ చేశారు.

ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సం సందర్భంగా నిర్వహించే వైమానిక విన్యాసాలకు, ల్యాండింగ్‌ కసరత్తుకు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏఎన్‌-32 విమానం, ఫైటర్‌ జెట్‌లు సుఖోయ్‌-30 ఎంకేఐ, మిరాజ్‌-2000లు ఆదివారం ఈ మార్గంపై ప్రయోగాత్మకంగా దిగాయి. ప్రధాన మంత్రిని తీసుకొచ్చే సి-130జె కూడా సుల్తాన్‌పుర్‌ జిల్లాలో సిమెంటుతో వేసిన ఎయిర్‌ స్ట్రిప్‌లో దిగింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే సుమారు ₹22,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. యూపీ రాజధాని లక్నోను తూర్పు ప్రాంతంలోని ప్రధాన నగరాలైన ప్రయాగ్‌రాజ్, వారణాసికి అనుసంధానం చేస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్‌పూర్, అంబేద్కర్ నగర్, అజంగఢ్, మౌ, ఘాజీపూర్‌లతో సహా తొమ్మిది జిల్లాల గుండా వెళుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధితో, రాష్ట్ర తూర్పు ప్రాంతం కూడా ఆగ్రా-లక్నో, యమునా ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా దేశ రాజధాని ఢిల్లీకి అనుసంధానించారు.

340 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో కొన్ని సెక్షన్లను అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు దిగడానికి, టేకాఫ్‌ కావడానికి వీలుగా తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా యుద్ధ విమానాల కోసం అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే తన ప్రణాళికలలో భాగమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గత వారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందని అన్నారు. మోడీ మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మోదీ సుల్తాన్‌పుర్‌ జిల్లాలోని కర్వాల్‌ ఖేరి వద్ద దిగుతారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన తర్వాత, భారత వైమానిక దళం (IAF) నిర్వహించిన ఎయిర్ షోను వీక్షిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

C-130J సూపర్ హెర్క్యులస్‌తో పాటు, రాఫెల్, మిరాజ్, జాగ్వార్, సుఖోయ్, కిరణ్ Mk II మరియు AN-32 వంటి యుద్ధ విమానాలు 45 నిమిషాల ఎయిర్ షోలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఏడాది సెప్టెంబరులో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీలు రాజస్తాన్‌లో సత్తా-గాంధవ్‌ రహదారిపై ఏర్పాటు చేసిన అత్యవసర ల్యాండింగ్‌ స్ట్రిప్‌ను ప్రారంభించారు. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో ఆరు లేన్లు ఉన్నాయి. అవసరమైతే భవిష్యత్‌లో దీన్ని 8 లేన్లకు విస్తరించొచ్చు.

Read Also… Quarantine-Free Travel: భారత్ వచ్చే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ నిబంధనలు వర్తించవు!