న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఈ రోజు వర్చువల్‌గా తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గతంలో మాదిరిగా ఒక్కో రైలును ప్రారంభించటం కాకుండా ఒకేసారి తొమ్మిది రైళ్లను పట్టాలెక్కించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 24) ఒకేసారి తొమ్మిది వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. వర్చువల్‌గా జెండా ఊపి ప్రధాని మోదీ వాటిని ప్రారంభించనున్నారు. కాచిగూడ – యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్, విజయవాడ – చెన్నై సర్వీసు, ఉదయ్‌పూర్ – జైపూర్, తిరునెల్వేలి – చెన్నై, పట్నా – హౌరా, కాసర్‌గాడ్ – తిరువనంతపురం, రౌర్కెలా – భువనేశ్వర్ – పూరీ, రాంచీ – హౌరా, జామ్‌నగర్ – అహ్మదాబాద్.. ఈ 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మరికొన్ని గంటల్లో ఇవన్నీ పట్టాలెక్కనున్నాయి. వీటిల్లో కాచిగూడ–యశ్వంత్‌పూర్ వందేభారత్ ట్రైన్ రెండు నెలల క్రితమే ప్రారంభం కావాల్సి ఉండగా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రైళ్లను ప్రారంభించేందుకు వీలుగా దాని ప్రారంభాన్ని కేంద్రం తాత్కాలికంగా వాయిదా వేసింది.
అంతేకాకుండా గతంలో ప్రారంభించిన వందేభారత్ రైళ్లు 16 కోచ్‌లతో ఉన్నాయి. ప్రస్తుతం ఒకేసారి పట్టాలెక్కుతున్న 9 వందేభారత్ రైళ్లు మాత్రం కేవలం ఎనిమిది కోచ్‌లతోనే సిద్ధం చేశారు. ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏడు ఎకానమీ చైర్‌కార్ కోచ్‌లు మాత్రమే ఉండనున్నాయి. ఆక్యుపెన్సీ రేషియోతో పాటు డిమాండ్ కూడా పెరిగితే పరిగితే వాటి కోచ్‌ల సంఖ్యను భవిష్యత్తులో పెంచే అవకాశం ఉందని అధికారులంటున్నారు. ఇక హైదరాబాద్ – బెంగుళూరు మధ్య ఐటీ ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఈ రెండు నగరాల మధ్య రెగ్యులర్ సర్వీసులు 3 ఉన్నాయి. అవేంటంటే.. కాచిగూడ – బెంగుళూరు – మైసూరు, కాచిగూడ – యలహంక, నిజాముద్దీన్ – బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు నిత్యం నడుస్తున్నాయి. ఇవి కాకుండా వారానికి మూడు రోజులు గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు, ఒక్కో రోజు చొప్పున కాచిగూడ – యశ్వంత్‌పూర్ జబల్‌పూర్ – యశ్వంత్‌పూర్ లక్నో – యశ్వంత్‌పూర్‌లు నడుస్తున్నాయి. వీటికి తోడుగా ఇప్పుడు నాలుగో రెగ్యులర్ సర్వీసుగా వందేభారత్ ప్రారంభంకానుంది. ఈ రైలు మహబూబ్‌నగర్ మీదుగా ప్రయాణించి మూడు రాష్ట్రాల మీదుగా అంటే తెలంగాణ – ఏపీ – కర్ణాటకలను కలుపుతూ ప్రయాణించనుంది. ఫ
ప్రస్తుతం హైదరాబాద్ – బెంగుళూరు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు గమ్య స్థానం చేరుకోవడానికి పదకొండున్నర గంటల సమయం తీసుకుంటున్నాయి. వీటిల్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ మాత్రమే 10 గంటల్లో చేరుతుంది. ప్రస్తుతం కొత్తగా పట్టాలెక్కనున్న వందేభారత్ సర్వీసు 8 గంటల్లోనే గమ్యం చేరుకోనుండటం విశేషం. కాచిగూడలో ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైతే మధ్యాహ్నం 2:15 గంటలకే బెంగుళూరు చేరుకుంటుందన్నమాట. తిరిగి అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:15కు కాచిగూడకు చేరుకుంటుంది. అయితే ఈ ట్రైన్ అధికారిక ప్రయాణ వేళలు ఇంకా ప్రకటించలేదు. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం స్టేషన్లలో మాత్రమే ఈ ట్రైన్ ఆగుతుంది. మరో రెండు స్టేషన్లలో ఆగేందుకు డిమాండ్ వస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.