సంస్కరణల బాటలో భారత్.. 2025లో సామాన్యుడి జీవితాన్ని మార్చేలా కీలక నిర్ణయాలు..

భారత్ సంస్కరణలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆదాయపు పన్ను, జీఎస్టీ సరళీకరణ, చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం, కార్మిక సంక్షేమం, మహిళా సాధికారత ఈ సంస్కరణల ముఖ్యాంశాలు. పాత చట్టాల రద్దు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలతో భారత్ ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తోంది. ఇదే సమయంలో సామాన్యుడికి ఎంతో మేలు జరుగుతుంది.

సంస్కరణల బాటలో భారత్.. 2025లో సామాన్యుడి జీవితాన్ని మార్చేలా కీలక నిర్ణయాలు..
Pm Modi Shares India Reform Express 2025

Updated on: Dec 30, 2025 | 5:46 PM

భారత్ ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గత పదేళ్ల ప్రగతిని పునాదిగా చేసుకుని.. 2025లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త సంస్కరణలు దేశ రూపురేఖలను మార్చడమే కాకుండా ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయి. “సంస్కరణల ఎక్స్‌ప్రెస్” పేరుతో సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రధానంగా పన్నులు, వ్యాపారం, ఉపాధి రంగాలపై దృష్టి సారించారు.

పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్

మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ ప్రభుత్వం ఆదాయపు పన్ను విధానంలో చారిత్రాత్మక మార్పులు చేసింది. ఏడాదికి రూ.12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులు ఇకపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 1961 నాటి పాత చట్టం స్థానంలో సులభమైన ఆదాయపు పన్ను చట్టం, 2025ను తీసుకువచ్చారు.

జీఎస్టీ సరళీకరణ

వ్యాపారస్తులకు, సామాన్యులకు ఇబ్బంది లేకుండా జీఎస్టీని కేవలం రెండు ప్రధాన స్లాబ్‌లుగా మార్చారు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉండటమే కాకుండా ఎంఎస్‌ఎంఈ రంగంపై భారం తగ్గింది.

చిన్న వ్యాపారాలకు పెద్ద పీట

వ్యాపారస్తులు నిబంధనల చక్రబంధంలో చిక్కుకోకుండా ఉండేందుకు చిన్న కంపెనీల పరిధిని పెంచారు. ఇప్పుడు రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు కూడా చిన్న కంపెనీల కిందికే వస్తాయి. దీనివల్ల వేలాది వ్యాపారాలకు ఆడిటింగ్, ఇతర ప్రభుత్వ నిబంధనల ఖర్చులు తగ్గుతాయి.

కార్మిక సంక్షేమం – మహిళా సాధికారత

పాతకాలపు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటిని కేవలం 4 కోడ్‌లుగా మార్చారు. అసంఘటిత కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించారు. పని ప్రదేశాల్లో మహిళల భాగస్వామ్యం పెంచేలా, వారికి రక్షణ కల్పించేలా చట్టాలను రూపొందించారు.

అంతర్జాతీయ వాణిజ్యం – నీలి విప్లవం

భారతీయ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు బ్రిటన్, న్యూజిలాండ్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే సముద్ర మార్గాల ద్వారా వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ఐదు కొత్త చట్టాలను తెచ్చారు. ఇది ఎగుమతిదారులకు మరియు ఓడరేవుల అభివృద్ధికి ఎంతో కీలకం.

పాత చట్టాల రద్దు

పాలనలో అనవసరపు అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం 71 పాతకాలపు చట్టాలను పూర్తిగా రద్దు చేసింది. దీనివల్ల పారిశ్రామికవేత్తలు భయం లేకుండా కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం లభించింది.

ఈ సంస్కరణలన్నీ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అమలులో వేగాన్ని పెంచడం ద్వారా భారతదేశం 2025లో ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. సామాన్యుడికి తక్కువ ధరలు, యువతకు ఉద్యోగాలు, వ్యాపారస్తులకు స్వేచ్ఛను ఇవ్వడమే ఈ మార్పుల అసలు లక్ష్యం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..