
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు, లక్షలాది మంది జనం తరలివచ్చారు. ఈ మహత్తర ఘట్టం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగింది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు.. ప్రధాని మోదీ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన నేతృత్వంలోనే పండితులు క్రతువును పూర్తిచేశారు. ముహుర్తం ప్రకారం.. జనవరి 22న .. 12 గంటల ఐదు నిమిషాల నుంచి బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కు సంబంధించి వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్లు ..అంటే 84 సెకన్ల దివ్య ముహుర్తంలో బాలరాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట పరిపూర్ణమైంది. దీంతో రామ భక్తులంతా బాలరాముడిని చూసి తరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కీలక విషయాలను మంగళవారం పంచుకున్నారు. అయోధ్యలోని రామ మందిరానికి తీసుకెళ్లేందుకు శ్రీ రంగనాథ్ స్వామి ఆలయంలో పీఠాధిపతి తరపున ప్రధానమంత్రికి పట్టువస్త్రాలను సమర్పించారు. దీంతో ప్రధానమంత్రి మోదీ.. దానిని అయోధ్యలోని రామ్ లల్లా ఆలయంలో సమర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. అయితే, తమిళనాడులోని రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించిన సమయంలో.. ప్రధాని మోదీకి శ్రీరంగం పీఠాధిపతి, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అయోధ్యలోని శ్రీ బాలరామునికి అలంకరించేందుకు పట్టువస్త్రాలు అందజేయగా.. ఆయన దానిని అయోధ్యలో అర్చకులకు అందజేశారు. దీంతో రంగనాథస్వామి ఆలయ అర్చకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ప్రధాని మోదీకి పట్టు వస్త్రాలు ఇస్తే.. భద్రంగా తీసుకెళ్లి ఇవ్వడం ఆయన దార్శనికతకు నిదర్శనమంటూ కొనియాడుతున్నారు.
Ramanathaswamy Shrine
కాగా.. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పవిత్ర పుణ్య క్షేత్రాలను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం నిష్టగా 11 రోజులపాటు కఠిన ఉపవాస దీక్షను చేపట్టారు ప్రధాని మోదీ. రాముడు నడియాడిన క్షేత్రాలను సందర్శించారు. తమిళనాడులో రామసేతును దర్శించారు..సముద్ర స్నానం చేశారు. రామేశ్వరంలో.. శ్రీరంగంలో.. ధనుష్కోటి కోదండరామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 11 రోజుల దీక్షలో ప్రతినిత్య రామాయణాన్ని పఠించారు. నియమ నిష్టలో దీక్షను కొనసాగించిన ప్రధాని మోదీ.. మనసంతా భక్తితో రామవిగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మోదీ ఉపవాస దీక్షను విరమించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..