PM Modi: ట్రంప్‌కు మరో ఝలక్.. రష్యా అధ్యక్షుడికి మోదీ ఫోన్.. కారణమిదే..?

ట్రంప్ టారీఫ్‌లతో బెదిరిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే అమెరికా నుంచి ఆయుధ కొనుగోళ్లను నిలిపేసిన మోదీ..ట్రంప్‌కు మరో ఝలక్ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారు. భారత పర్యటనకు రావాలని ఆహ్వానించారు. దీనికి పుతిన్ సానుకూలంగా స్పందించారు.

PM Modi: ట్రంప్‌కు మరో ఝలక్.. రష్యా అధ్యక్షుడికి మోదీ ఫోన్.. కారణమిదే..?
Modi Speaks with Putin

Edited By:

Updated on: Aug 09, 2025 | 8:11 AM

ట్రంప్ టారీఫ్‌లను ధీటుగా ఎదర్కొనేలా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే భారత్‌పై ట్రంప్ 50శాతం పన్నులు విధించారు. రష్యాతో చమురు కొనుగోలు చేయడమే దీనికి కారణంగా చెప్పాడు. మరోవైపు ట్రంప్ టారీఫ్‌లు పెంచడం అన్యాయమంటూ భారత్ తీవ్రంగా స్పందించింది. ఇదే సమయంలో అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేయకూడదని నిర్ణయించింది. యుద్ధ విమానాలతో పాటు క్షిపణుల కొనుగోళ్లకు బ్రేక్ వేసింది. అటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇది అగ్రరాజ్యానికి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మోదీ ఫోన్ చేశారు. భారత్ పర్యటనకు రావాలని పుతిన్‌ను మోదీ ఆహ్వానించారు. వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి ఈ ఏడాది చివర్లో భారత్‌ను సందర్శించాలని మోదీ పుతిన్‌ను ఆహ్వానించారు.

కేంద్ర కేబినెట్ మీటింగ్ తర్వాత మోదీ పుతిన్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు సంబంధించిన తాజా పరిణామాలను పుతిన్ మోదీకి వివరించారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడం కోసం భారత్ యొక్క స్థిరమైన వైఖరిని ప్రధాని నొక్కి చెప్పారు. అదేవిధంగా భారత్-రష్యా విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ ఏడాది చివర్లో జరిగే 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి మోదీ పుతిన్‌ను ఆహ్వానించారు. దీనికి రష్యా అధ్యక్షుడు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

మరోవైపు మోదీ ఈ నెల చివర్లో చైనా పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు ఆయన చైనాలో పర్యటిస్తారు. షాంఘై సహకార సదస్సులో మోదీ పాల్గొంటారు. ఓ వైపు ట్రంప్ చైనాపై మండిపడుతున్న తరుణంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ-జిన్ పింగ్ చర్చలు జరపనున్నారు. చైనా కంటే ముందు మోదీ జపాన్‌లో పర్యటిస్తారు. ఏది ఏమైన మోదీ అడుగులు ట్రంప్‌కు బిగ్ షాకిస్తున్నాయని చెప్పొచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..