
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం దేశ టెక్నాలజీ రంగంలో కొత్త గుర్తింపు తెచ్చుకుంది. 1 గిగావాట్ సామర్థ్యం గల హైపర్ స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, అత్యాధునిక ఇంధన మౌలిక వసతులతో కూడిన గూగుల్ తొలి ఏఐ హబ్‌ను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మంగళవారం దిల్లీ వేదికగా కుదిరింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తదితరులు హాజరయ్యారు.
ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ రాబోయే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఇది భారత్‌లో గూగుల్ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టుతో విశాఖ ప్రపంచ కనెక్టివిటీ హబ్‌గా మారుతుందని థామస్ కురియన్ తెలిపారు. విశాఖ నుంచి 12 దేశాలకు సబ్‌సీ కేబుల్ లింక్‌లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ చారిత్రక ఒప్పందంపై ఉత్సాహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడి, గూగుల్ తొలి ఏఐ హబ్ ప్రణాళికలను వివరించారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. “విశాఖపట్నంలో గూగుల్ తొలి ఏఐ హబ్ ప్రణాళికలను పంచుకునేందుకు ప్రధానమంత్రి మోదీతో మాట్లాడాను. ఈ హబ్ గిగావాట్ సామర్థ్యంతో కూడిన హైపర్ స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీస్థాయి ఇంధన మౌలిక వసతులతో రూపుదిద్దుకుంటుంది. ఇది భారతీయ సంస్థలు, వినియోగదారులకు అధునాతన సాంకేతికతను అందించే కీలక మైలురాయిగా నిలుస్తుంది. కృత్రిమ మేధా ఆవిష్కరణలను మరింత వేగవంతం చేస్తాం” ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.
సుందర్ పిచాయ్ ట్వీట్‌కు స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ‘ఎక్స్’లో ఒక శుభాకాంక్షా సందేశం పోస్ట్ చేశారు. “విశాఖపట్నం వంటి చురుకైన నగరంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభం నాకు ఎంతో ఆనందంగా ఉంది. గిగావాట్ స్థాయి డేటా సెంటర్ మౌలిక వసతులను కలిగి ఉన్న ఈ బహుముఖ పెట్టుబడి, ‘వికసిత్ భారత్’ నిర్మాణం పట్ల మన దృష్టికి అనుగుణంగా ఉంది. ఇది సాంకేతికతను ప్రజలందరికీ అందించే శక్తివంతమైన సాధనంగా నిలుస్తుంది. ‘AI for All’ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ ప్రాజెక్ట్ ముందడుగు వేస్తుంది. అత్యాధునిక సాధనాలను పౌరులకు అందిస్తూ, మన డిజిటల్ ఎకానమీని బలోపేతం చేస్తూ, భారత్‌ను ప్రపంచ సాంకేతిక శక్తిగా నిలబెట్టే దిశగా ఇది కీలకంగా మారుతుంది” ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Delighted by the launch of the Google AI Hub in the dynamic city of Visakhapatnam, Andhra Pradesh.
This multi-faceted investment that includes gigawatt-scale data center infrastructure, aligns with our vision to build a Viksit Bharat. It will be a powerful force in… https://t.co/lbjO3OSyMy
— Narendra Modi (@narendramodi) October 14, 2025
ఈ ఒప్పందంతో విశాఖపట్నం కేవలం తీరప్రాంత నగరం మాత్రమే కాదు, ప్రపంచ టెక్ మ్యాప్‌లో కొత్త కేంద్రముగా అవతరించబోతోంది. గూగుల్ ఏఐ హబ్ ప్రారంభం భారత్ డిజిటల్ ఎకానమీకి గేమ్-చేంజర్‌గా నిలిచి, కృత్రిమ మేధా రంగంలో దేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే దిశగా మార్గం సుగమం చేస్తోంది.