ఉద్యోగాల జాతర….పదో పరకో కాదు.. ఏకంగా కోట్లాది మందికి ఉద్యోగాలు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రామ్స్‌లో కీలకమైనది యువతకు ఉద్యోగాలు. ఇచ్చిన హామీ మేరకు నరేంద్ర మోదీ సర్కార్ పదేళ్ళలో అనుకున్న లక్ష్యాన్ని దాటేసింది. 2023-24లో దేశంలో ఉపాధి గత 10 ఏళ్లలో 36 శాతం పెరిగి 64.33 కోట్లకు చేరుకుందని కేంద్ర కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. 2014-15లో ఇది 47.15 కోట్లుగా ఉంది. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో ఉపాధి పరిస్థితి మెరుగుపడిందని ఇది చూపిస్తుంది, అయితే యుపిఎ ప్రభుత్వ హయాంలో 2004 – 2014 మధ్య, ఉపాధిలో కేవలం ఏడు శాతం మాత్రమే పెరుగుదల కనిపించింది. దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఓ అరుదైన ఘనత అంటోంది ఎన్డీఏ సర్కార్.
యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 మధ్య కేవలం 2.9 కోట్ల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని, నరేంద్ర మోదీ హయాంలో 2014-24 మధ్య కాలంలో 17.19 కోట్ల ఉద్యోగాలు పెరిగాయని మన్‌సుఖ్ మాండవియా చెప్పారు. గత ఏడాది అంటే 2023-24లో దేశంలో దాదాపు 4.6 కోట్ల ఉద్యోగాలు సృష్టించామన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి, మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, యుపిఎ హయాంలో, 2004 – 2014 మధ్య ఉపాధి 16 శాతం క్షీణించిందని, అయితే ఎన్‌డిఎ హయాంలో 2014 నుండి 2023 మధ్య 19 శాతం పెరిగిందని చెప్పారు. అదేవిధంగా, యుపిఎ హయాంలో, తయారీ రంగంలో ఉపాధి 2004 – 2014 మధ్య కేవలం ఆరు శాతం మాత్రమే పెరిగింది. అయితే ఎన్‌డిఎ హయాంలో 2014-2023 మధ్య 15 శాతం పెరిగిందని ఆయన వెల్లడించారు.
యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో సేవారంగంలో ఉపాధి 25 శాతం పెరిగిందని, మోదీ హయాంలో 2014 నుంచి 2023 మధ్య కాలంలో 36 శాతం పెరిగాయని చెప్పారు. 2017-18లో ఆరు శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2023-24లో 3.2 శాతానికి తగ్గుతుందని మాండవ్య చెప్పారు. అదే సమయంలో, ఉపాధి రేటు అంటే పని చేసే జనాభా నిష్పత్తి 2023-24లో 58.2 శాతానికి పెరిగింది. ఇది 2017-18లో 46.8 శాతంగా ఉంది. అదేవిధంగా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (LFPR) 2023-24లో 60.1 శాతానికి పెరిగింది. ఇది 2017-18లో 49.8 శాతంగా ఉంది.
గత ఏడేళ్లలో అంటే సెప్టెంబర్ 2017-సెప్టెంబర్ 2024 మధ్యకాలంలో 4.7 కోట్ల మంది యువత (18-28 ఏళ్ల వయస్సు) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో చేరారు. సంఘటిత రంగంలో ఉద్యోగాల్లో చేరే యువత సంఖ్య పెరుగుదలకు సంబంధించి, EPFO డేటా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిందిగా చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..